ఆనాటి ఋగ్వేదాది శాస్త్రాల దగ్గర నుంచి ఈనాటి అణు శాస్త్రం వరకు అంతా శాస్త్ర ప్రపంచమే. అలాగే వంట చేయటం మొదలుకొని కవిత్వం చెప్పి మెప్పించే దాకా అంతా కళా సందోహమే. ప్రాపంచికమైన వస్తువుల గుణ దోషాలను పరిశీలించి వాటి స్వరూపాన్ని నిర్ణయించటమే శాస్త్రం చేసే పని. హృదయంలో సుప్తంగా ఉండే వాసనలను మేలు కొలిపి ఒకానొక అ లౌకికమైన ఆనందాన్ని ప్రసాదించటమే కళాకార్యం. ఒకటి పదార్థ విజ్ఞానాన్ని అందిస్తే మరొకటి వాసనా జన్యమైన ఆహ్లాదాన్ని అందజేస్తుంది. ఈనాడు మూడు లక్షల మైళ్ళ దూరంలో ఉన్న చంద్ర మండలం మీదికి వెళ్ళి వచ్చాడంటే తనకు బాహ్యంగా ఉన్న ఒక పదార్ధ తత్త్వాన్ని శోధించి తెలుసుకొన్నా డన్న మాట మానవుడు. అలాగే ఒక, కమ్మని సంగీతం విని సంతోషించా డంటే తద్వారా తన ఆంతర్యంలో దాగి ఉన్న వాసనా తరంగాలనే అనుభవిస్తున్నాడనే అర్ధం.
మొత్తం మీద బాహ్యంగా కనిపించే భూత రాశి ఆభ్యంతరంగా ఉండే వాసనా రాశి వీటి రెండిటినీ దాటి పోలేదు ఏశాస్త్రమైనా ఏ కళైనా. ఇవి రెండూ ఈ శరీరమున్నంత వరకే మన అనుభవానికి వచ్చేది. శరీరం ఎంతో కాలం మన ఆధీనంలో ఉండదు. చూస్తూ చూస్తుండగానే ఎప్పుడో మనకు చెప్పకుండానే తప్పించుకు పోతుంది. దానితో పాటు హృదయము మనసు పడిపోక తప్పదు. అవీ పోతాయి. దీనితో మనం చేసిన శాస్త్ర, కళా పరిశ్రమ అంతా కృష్ణా ర్పణమే. పాంచ భౌతికంగా చేసిన కృషి కాబట్టి పంచ భూతాలకే అప్పగించి పోవలసి వస్తుంది. చూడండి ! చంద్ర మండలం పోయి వచ్చిన మానవుడు కూడా చివర కేమై పోయాడు.
Page 108