#


Index

ఐహికము ఆముష్మికము

  ధర్మార్ధ కామ మోక్షాలనే నాలుగింటిలో అర్ధ కామాలనే రెండింటికీ ఐహికమని పేరు. ఈ రెండు పురుషార్ధాలు ఆ బాల గోపాలం లోకంలో అందరికీ ప్రసిద్ధమే. ఒక మిఠాయి పొట్లం చేతికి తీసుకొని తింటూ తృప్తి పొందాలని ఒక బాలుడి కెలా ఉంటుందో అలా ఒక రాజ్యాన్ని పాలిస్తూ దర్జాగా బ్రతకాలని ఒక గోపాలుడికీ ఉంటుంది. అందుచేతనే ఆ బాల గోపాలమని పేర్కొనటం. ప్రతి ఒక్కడికీ జీవితంలో తనకు కావలసిన పరికరాలన్ని సమకూర్చుకొని జీవితాంతం సుఖంగా గడపాలనే ఉంటుంది కాని కష్టాల పాలు కావాలని ఎవరికీ ఉండదు. అప్పటికప్పుడు పుట్టిన శిశువు కూడా నాలుక మీద వేసిన పదార్ధాన్ని చప్పరిస్తుంది. పిచ్చి వాడు కూడా చేతికి చిక్కిన పదార్ధాన్ని వదులు కోలేడు. చావబోయే శతవృద్ధు కూడా ప్రాణాలు నిలబెట్టుకోటానికి మందులు మాకుల కోసం ప్రాకు లాడుతాడు. అర్ధకామాల మీద ఇంత గాఢంగా ఉంది మానవుని దృష్టి.

  ఈ మాత్రమే ఐతే ఇది జంతు జాలానికి కూడా ఉంది కదా. ఇక ఈ రెండింటికి పురుషార్ధాలని పేరు పెట్టి సుఖమేమిటి అని అడగవచ్చు. అర్ధ కామాలు జంతువులకూ ఉన్న మాట వాస్తవమే. కాని జంతువులకు కేవలం భౌతికంగానే ఉంటాయి అవి. మానవులకు భౌతికంగానే కాక మానసికంగానూ హార్థికంగానూ కూడా వాటిని మనం చూడవచ్చు. మానసికమైన అర్ధమే శాస్త్ర విజ్ఞానం. హార్ధికమైనదే కళా విజ్ఞానం.

Page 107