పురుషార్ధములు వాని వివరణ
మానవుడు తన మానవత్వాన్ని నిలబెట్టుకోవాలంటే జీవితానికంతా లక్ష్య భూతమైన పురుషార్ధాన్ని సాధించక తప్పదని చెప్పాము. ఐతే ఈ పురుషార్ధమంటే ఏమిటి? అది ఎన్ని విధాలు? అనే ప్రశ్న వస్తుంది. జీవితాని కనుకూలమైన దర్ధం. ప్రతికూలమైన దనర్థం. అనర్ధాన్ని పరిహరిస్తూ అర్ధాన్ని పాటిస్తూ పోవటమే పురుషార్ధ సాధన.
ఇలాంటి పురుషార్ధాలు మానవ జీవితాని కంతా కలిసి నాలుగే నాలుగున్నాయి. ఒకటి ధర్మం మరొకటి అర్ధం. మరొకటి కామం ఇంకొకటి మోక్షం. చతుర్విధ పురుషార్ధాలంటే ఇవే. జీవిత సర్వస్వం వీటి లోనే ఇమిడి ఉంది. అందులోనూ ఈ నాలుగింటినే పరిగణించటంలో - వాటిని గూడా ఈ క్రమంలోనే పరిగణించటంలో కూడా ఒక చక్కని ఉపపత్తి ఉంది. ప్రతి వాడూ తన ధర్మాన్ని ఆచరిస్తేనే కాని అర్ధమనేది లభించదు. అర్ధమంటే జీవితం సుఖంగా సాగటానికి కావలసిన అన్ని వస్తువులు, అన్ని సౌకర్యాలు. అవి లభించిన తరువాత మానవుడి కామం లేదా వాంఛలన్నీ తీరిపోతాయి. ఐతే ఎంత సాఫల్య మిలా గలిగినా జీవితంలో అది సొంతమే అనంతం కాదు. అనంతమైన సౌఖ్యాన్ని చూరగొనాలనే కదా మానవుడి అభిలాష. అది ధర్మార్థ కామములనే మూడింటిలోనూ మనకు కానరాదు. దానికి సంబంధించిన పురుషార్ధం నాలుగవది ఐన మోక్ష మొక్కటే. మోక్షం మానవుడికి నిత్యమైన సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుకనే అది పరమ పురుషార్ధమని పేర్కొన బడుతున్నది. మొత్తము మీద నాలుగు కలిసి జీవితాన్ని అంతటినీ ఆపోశనం పడుతున్నాయి.
Page 105