#


Index

  అతడికి మంచి ఏమిటో చెడ్డ ఏమిటో విభజించి చూచే జ్ఞానముంది. దానితో ఇది కర్తవ్యమిది అకర్తవ్యమని స్పష్టంగా గ్రహించగలడు. కర్తవ్య జ్ఞాన మెప్పుడున్నదో అప్పుడా కర్తవ్యాన్ని జీవితాంతమూ పాటించవలసిన బాధ్యత గూడా ఏర్పడింది మానవుడికి.

  దీనికే ధర్మమనిపేరు. దీనికి విరుద్ధంగా నడిస్తే అది అధర్మం. ధర్మా ధర్మాలు రెండూ మనకు శాస్త్రం బోధిస్తున్నది. శాస్త్రమంటే శాసించేది అని అర్ధం. అది విధి నిషేధాత్మకం. ఇది నీకు హితం దీని నాచరించమని చెప్పేది విధి. ఇది నీకు హితం కాదు ఆచరించవద్దని చెప్పేది నిషేధం. దీని వల్ల మానవుడు కేవలం తన బుద్దిని బట్టే కాక శాస్త్రో పదేశాన్ని బట్టి కూడా హితా హితాలు నిర్ణయించుకొని జీవితంలో హితమైన మార్గాన్నే అనుసరిస్తాడు. హితానికే అర్ధమని పేరు. అర్ధమంటే జీవితంలో ప్రతి మానవుడు కోరదగినది. పురుషుడు కోరేది కాబట్టి దానినే పురుషార్ధమన్నారు పెద్దలు. పురుషుడైన ప్రతివాడు సాధించవలసింది పురుషార్థం. అలా సాధించ గలిగినప్పుడే - కనీసం అలాంటి దొకటి ఉన్నదని గ్రహించి దానికోసం యత్నించినప్పుడే - పురుషుడని, మానవుడని పేరు మనకు సార్ధక మౌతుంది. లేకపోతే మనం మానవులమే కాదు. పురుషుల మంతకన్నా కాదు. కేవల మాకలి దప్పులు. కామక్రోధాదులు మొదలైన వాసనల ప్రోద్బలంతోనే బ్రతుకుతూపోయే రెండు కాళ్ళ జంతువులం.

Page 104