#


Index

సంకేతవాదము శ్రీమత్ భాగవత సామ్రాజ్యము

  అయితే ఆచరించటంలో మంచీ ఉంది. చెడ్డా ఉంది. చెడ్డను పరిహరిస్తూ మంచి నాచరిస్తూ పోతే మరలా మానవుడు పైకి లేవగలుగుతాడు. ఊర్ధ్వముఖంగా పయనిస్తాడు. అప్పుడీ నైమిశమే వాడి పాలిటికి విష్ణు క్షేత్రమవుతుంది. అలాటి మోక్షసాధకులే శౌనకాదులు. శునకస్యా పత్యమ్ పుమాన్ శౌనకః అని అర్థం చెప్పుకోవాలి. శునక స్వభావం లాంటి స్వభావమున్నవాడు. శునక స్వభావమేమిటి. శ్రద్ధ, విశ్వాసం. ఇలాటి విశ్వాసమూ, ఆస్తిక్య బుద్ధీ - శుశ్రూషా ఎవరిలో ఉంటే వారంతా శౌనకులే. వారు జీవితమంతా సత్కర్మా చరణమే చేస్తుంటారు. అదే దీర్ఘ సత్రయాగం. సహస్ర మాసాలంటే జీవితకాలమే. సహస్ర మాస జీవి అనే మాట ఇప్పటికీ వ్యవహారంలో వినిపిస్తుంది. చాలాకాలం జీవించే పెద్దలనలా పేర్కొంటాము మనం. అప్పటికి జీవితాంతమూ ఈశ్వరార్పణ బుద్ధితో ఈ భూమిమీద పుణ్య కర్మానుష్ఠానం చేస్తూ పోవటమే వారనుష్ఠించారని చెప్పే సత్రయాగం.

  అయితే ఈ కేవల కర్మానుష్ఠానం వల్ల మానవుడు సాధించే ప్రయోజనమేదీ లేదు. మనకు కావలసిన పరమ ప్రయోజనం మోక్షం. దానికి నోచని నాడిక ఎంత గొప్ప సత్కర్మ లాచరించినా అది నిష్ఫలమే. అది సిద్ధించాలంటే ఒక్క భగవత్తత్త్వాను సంధానం వల్లనే. అది తత్కథా శ్రవణంమూలాన్నే. కాని అది వట్టి గొంతెమ్మ కోరిక అయితే ఏమి సుఖం. దానికి తగిన గురువు దొరకాలి. వాడే సూతుడు. సద్గురువు కుండవలసిన లక్షణాలన్నీ ఉన్నా యాయనకు. సూతుడి కుగ్రశ్రవుడని మరొక పేరు. శ్రవస్సంటే శ్రుతమూ లేదా విజ్ఞానం. ఉగ్రమంటే తీక్షం. తీక్షమైన ప్రజ్ఞాపాటవం కలవాడని అర్థం. అలాంటివాడు సూతుడయ్యాడు. అంటే జన్మించాడు. ఎవరికి, రోమహర్షణుడనే మహర్షికి. రోమహర్షణుడెవరు. రోమహర్షం, రోమాంచం అంటే శరీరానికి గగుర్పాటు. వ్యాసమహర్షి అంతే వాసులలో ఒకడయి ఆయన పురాణేతి హాసాలు ప్రవచనం చేస్తుంటే భక్తి పారవశ్యంతో పులకితుడయ్యే మహా భాగవతుడాయన. కనుకనే ఆ పేరు సార్థకమాయనకు. వ్యాసుడు వేదాలను నాలుగుగా విభజించి వాటిని తన నలుగురు శిష్యులకూ బోధించాడట.

తత్రర్వేద ధరః పైలః సామగో జైమినిః కవిః వైశం పాయన ఏ వైకో - నిష్ణాతో యజు షాం గణే అథర్వాం గిరసా మాసీ - త్సు మంతు ర్ధారుణో మునిః

Page 60

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు