సంకేతవాదము
శ్రీమత్ భాగవత సామ్రాజ్యము
3. సంకేతవాదము
పురాణములూ, అందులో భాగవతమూ, దాని ప్రాశస్త్యమూ వీటిని గూర్చి ఇంతవరకు చర్చించాము. పైగా బాహ్యస్వరూపంగాదు దాని ఆంతర్యమేమిటో తడవి చూడాలని కూడా పేర్కొన్నాము. అయితే ఆంతర్యమనేది ఉత్తమాధికారులే కొందరికో గాని మిగతా మంద మధ్యముల కది సహజంగా అంతు పట్టేదికాదు. వారు పురాణ ప్రాసాదానికి చుట్టూ కట్టిన ప్రాకారం దాకా వెళ్లగలరు. దాని చుట్టూరా తిరగగలరు. అంతేగాని గర్భాగారంలోకి చొచ్చుకొని పోలేరు. దానికి కారణమొక ప్రక్కవారికి సహజంగా ఉన్న అశక్తత అయితే మరొక ప్రక్క వాటిలో చోటు చేసుకొన్న సంకేత వాదం Allegory. సంకేతమన్నా, ప్రతీకమన్నా, అర్థవాదమన్నా ఒక్కటే. ఇతిహాస పురాణాలన్నీ అర్థవాదాత్మకాలని గదా ఇంతకు ముందు పేర్కొన్నాము. అర్థవాదమంటే చెప్పవలసిన విషయం సూటిగా నగ్నంగా చెప్పక దానికొక కవచం తొడిగి చాటుమాటుగా సూచన చేయటం. దీనినే ఆధునికులు ప్రతీకమనీ, సంకేతమనీ, Symbolism వ్యవహరిస్తారు. రహస్య వాద చ్చాయా వాదాలని కూడా కొందరు నిర్దేశిస్తున్నారు. ఇలాంటి ప్రతీకవాద మెంతైనా ఉంది భాగవతంలో. కథల దగ్గరి నుంచీ పాత్రలదగ్గరి నుంచీ వారి పేర్ల దగ్గర నుంచీ ప్రతి ఒక్కటీ ఒక ప్రతీకమే. ఒక సంకేతమే.
అసలు భాగవతావతరణాన్ని పరిశీలిస్తేనే మనకిది చక్కగా తార్కాణమవుతుంది. భాగవతమంతా మోక్షైక ప్రతిపాదకమని గదా పేర్కొన్నాము. అంచేత ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని కనుగుణమైన మార్గంలోనే ప్రతి ఒక్క అంశమూ మలచుకొన్నట్టు కనిపిస్తుంది. దేశకాల పాత్రలు మూడూ ఆ భావానికి దోహదం చేసేవే. దాన్ని స్ఫురింపజేసేవే. పురాణ ప్రవచనం జరిగిన ప్రదేశం విష్ణు క్షేత్రమని పేరు గాంచిన నైమిశారణ్యం. జరిగిన కాలం కలియుగారంభం. ప్రవక్త రోమహర్షణ కుమారుడైన సూత మహర్షి. మరి పురాణ శ్రోతలెవరో గారు. శౌనకాదులైన మహర్షులు. వీరు సహస్ర వర్ష పర్యంతమైన దీర్ఘసత్రమనే యాగాన్ని సంకల్పించి చేస్తుంటారు. ఆ సమయంలో సూతుడక్కడికి యాదృచ్ఛికంగా వస్తాడు. ఆయన
Page 58
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు