#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

సాంగత్యంతో తక్కిన వారు కూడా సదాచారాన్ని అవలంబిస్తే ఉత్తరణానికి నోచుకోగలరు. యద్యదాచరతి శ్రేష్ఠః అని భగవద్గీతే చాటుతున్నది. గతానుగతిక మైనదీ లోకం. ఒక పేరు ప్రఖ్యాతులున్న పురుషుణ్ణి లోకు లనుసరిస్తారు. వాడు పాషండుడైతే వీరూ పాషండ మతాన్నే అనుసరించి దుర్జనులౌతారు. సదాచారుడైతే అతని సదాచారాన్నే అనుసరించి సజ్జనులౌతారు. ఇలాంటి సదాచార ప్రవర్తకులైన మహాత్ముల నప్పుడప్పుడు లోకంలో అవతరింప జేసి తదుపదేశంతో పాషండ మత సంపర్కాన్ని వారికి వదిలించి మరలా యధోచితంగా వారిని సదాచార మార్గంలో నడుపుతుందావిడ. దీనినే శాస్త్రంలో లోక సంగ్రహమని పేర్కొంటారు.

17. సమయాచార తత్పరా
18. సంప్రదాయేశ్వరీ

  ఈ సదాచారమనేది ఎలాంటిది. దీని లక్షణ మెలాంటిది-అని అడిగితే వర్ణిస్తున్నారు సమయాచారమని. సమయాచారమే సదాచారం. సమ్య గేతీతి సమయః. సద్చిద్రూపమైన తత్త్వంతో ఏకం కావటమే సమయం. అలాంటి సమయాన్ని పొందించే ఆచారానికే సమయాచారమని పేరు. శివ సాయుద్యాన్ని ప్రసాదించే మార్గమని భావం. అదే సదాచారం. సద్రూపుడే గదా పరమాత్మ. అలాంటి పరమాత్మ సాయుజ్యానికి తోడ్పడే ఆచారం గనుక సదాచారం కూడా అదే అవుతున్నది.

  ఇలాంటి సమయాచారంలోనే తాత్పర్యమా దేవికి. తద్విరుద్ధమైన వామాచారాదులలో కాదు. ఎన్నో ఉన్నాయి సాధక లోకంలో ఆచారాలనేవి. వామాచారం కౌలాచారం దక్షిణాచారమని

Page 86

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు