#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

తత్కారణంగా ఈ దేహమే నా ఆత్మ అని ఈ మేరకే నా స్వరూపాన్ని పరిమితం చేసి చూస్తున్నాను. ఇదే అస్మిత అనే రెండవ పాశం.

  ఆ తరువాత రాగ ద్వేషాలనే మరి రెండు పాశాలేర్పడ్డాయి. ఒకటి అనుకూలిస్తే రాగం. ప్రతికూలిస్తే ద్వేషం. శరీరమాత్రమే ఆత్మ అని అభిమానించినప్పుడు ఇవి రెండూ తప్పవు. ఇవి రెండూ అంతకంతకు బలమయ్యే కొద్దీ అభినివేశమనేది ఎర్పడుతుంది. అత్యంతమూ వాటిలోనికి చొచ్చుకొని పోవటమే అభినివేశం. ఇది ఐదవ పాశం మనపాలిటికి. ఐదింటిలో అవిద్య అనేది తమస్సు. అస్మిత మోహం. రాగం మహా మోహం. ద్వేషం తామిస్రం. అభినివేశం అంధతమిస్రం. ఇలా చూస్తే ఐదూ ఐదు నరకాలు కూడా మనపాలిటికి. వాటిలో మొదటిది కొంత అదర్శనమైతే కడపటిది అత్యంత మదర్శనం.

  ఈ విధంగా ఉత్తరోత్తరం పేర్కొన పడ్డ ఈ ఐదు పాశాలతో చుట్ట బడ్డ ఈ జీవుడు పశువు గాక మరి ఎవడు. పంచ గుణీకృతమైన పశుత్వమిది. ఈ పశువును చుట్టు కొన్న అవిద్యాదులైన ఐదు పాశాలలోనూ అవిద్య అనేది మూలకారణం. అది వదలి పోతే తతిమావన్నీ వాటిపాటికవే తొలగి పోతాయి. అయితే ఈ అవిద్య ఎలా తొలగి పోతుంది. ఆత్మ విషయమైన విద్య చేతనే అది తొలగుతుంది. ఇంకొక ఉపాయం లేదు. శివ జ్ఞాన రూపమైన ఈ ఆత్మ విద్యను ఆ దేవి ఎప్పుడు ప్రసాదిస్తుందో - అప్పు డవిద్యతోపాటు సకల పాశాలూ తెగిపోగలవు. అంతవరకూ పాశ బద్ధుడైన జీవుడు వాటి నుంచి విమోచనం పొందగలడు.

Page 74

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు