#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

  ఇలా పరిహరిస్తూ పోతే చివరకు పరి శేష న్యాయంగా ఎది మిగులుతుందో అలాంటి ఆత్మ జ్ఞానమే శివమైన జ్ఞానమని తేలుతున్నది. అశివాత్మకమైన ఈ సంసారమంతా అందులోనే తుదకు ప్రవిలయమై పోతున్నది. దాన్ని ప్రవిలాపనం చేసి తద్వారా శివమైన తత్త్వాన్ని చేర్చేది మనకిది ఒక్కటే. కనుక వాస్తవంలో శాస్త్ర ప్రమాణాని కంతటికీ ప్రమేయ భూతమైనదీ ఆత్మ జ్ఞానమే. మహా అయితే ధర్మ జ్ఞానం ఆ జ్ఞానానికి అంగభూతమై దూరంగా దాని కుపకరిస్తున్నది. అంచేత రెండింటికీ పరస్పర వైరుధ్యముందని కూడా మనం భావించ నక్కరలేదు.

7. పశు పాశ విమోచనీ
8. ముక్తిదా

  ఆ పరా భట్టారిక గురు రూపంగా అవతరించి శాస్త్ర సర్వస్వమైన ఆత్మ జ్ఞానాన్ని మన కందిస్తుందని చెప్పాము. అది అందు కొన్నందు వల్ల మానవులకు కలిగే ప్రయోజన మేమిటని ఇప్పుడు పేర్కొన బడుతున్నది. పశు పాశవిమోచనమే ఆ ప్రయోజనం. పాశంతో కట్టివేయబడే దేమిటో అది పశువు. అవి చతుష్పాత్తులే కాదు. ద్విపాత్తైన మానవుడు కూడా ఒక పశువే. వీడు కూడా అనేక పాశాలతో కట్టబడిన వాడే. ఎమిటా పాశాలు. అవి వీడిని ఎలా కట్టి వేస్తున్నాయి. అవిద్యా అస్మితా రాగ ద్వేష అభినివేశా లనే అయిదింటినీ క్లేశాలని పరిగణించారు యోగ శాస్త్రజ్ఞులు. ఈ క్లేశాలే మనలను కట్టి వేసే పాశాలు. బంధన రూపమైన వివి. వీటి మూలంగానే మనకీ సంసార బంధమేర్పడింది. ఇందులో మొదటిది అవిద్య అనే పాశం. ఈ కనిపించే సర్వమూ- దీనిని కంటున్న నేనూ- రెండూ ఆత్మే అనే విద్య లేకపోవటమే అవిద్య. ఇది మన ఆత్మ చైతన్యాన్ని కప్పివేసింది.

Page 73

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు