#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

  ఇంత వరకూ నడచిన గ్రంధం పర దేవత అవరోహణ క్రమాన్ని వర్ణిస్తూ వచ్చింది. శ్రీ మాతా అనే నామం మొదలుకొని సర్వ మోహినీ అనే నామం వరకూ యాభై నాలుగు నామాలతో వర్ణించింది ఆ మహా శక్తి అవరోహణ మార్గం. మహా శక్తి అంటే ఆవిడ జగన్మాత గదా జీవులందరికీ తల్లి అయిన ఆ దేవి సర్వ మోహిని అయి మహా సాగరంలో పడవేయటమేమిటని సందేహం కలుగుతుంది. తల్లికెపుడూ బిడ్డలమీద వాత్సల్యమే ఉంటుంది కాని శత్రువుల మీద చూపినట్టు ద్వేషం చూపరాదు. అలాంటప్పుడు జగత్తుకంతా తల్లి అయిన ఆ దేవత ఎందుకిలా పగసాధిస్తున్నదని సందేహించటం సహజమే. దీనికి సమాధానమింతకు ముందే సూచించి ఉన్నాము. అయినా ఇప్పుడు ప్రసంగం వచ్చింది కాబట్టి మరి కొంత విపులంగా చర్చించ వలసి ఉంది.

  ఆ దేవి మన కందరికీ మాతృ దేవతే సందేహంలేదు. మాత గనుకనే వాస్తవంలో మన మీద ద్వేషంలే దావిడకు. మనలనీ మోహార్ణవంలో పారేయనూలేదు. అసలావిడ తన స్థానం నుంచి కదలి వచ్చి ఈ లోకంలోకి అవతరించనూ లేదు. ఇదంతా కేవలం అవిద్యా కల్పితమే. అనాది సిద్ధమైన అవిద్యా దోషం వల్ల మనమంతా ఆత్మ స్వరూపాన్ని మరచిపోయి దానినే జీవ రూపంగా కొంత - జగ ద్రూపంగా కొంత విభజించి చూస్తున్నాము. తన్మూలంగా సాంసారికమైన తాపత్రయ మనుభవిస్తున్నాము. అనుభవిస్తూ దీనికంతటికీ ఆ దేవి తిరోధాన శక్తే హేతువని ఊహిస్తున్నాము.

Page 63

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు