#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

గరంతో కూడినదేదో అది సగరం గరమంటే గరళం లేదా విషమని అర్థం. సగరమంటే అప్పటికి విషంతో కూడినది. సగరమే సాగరం. అది ఈ సంసారమే మసపాలిటికి.

  అంచేత ఆపాతతః ఇది సుధా రసం లాగా కనిపిస్తున్నా ఈ సంసారం- ఎప్పటికైనా ఇది హాలాహల విషంగానే పరిణమించే ప్రమాదముంది. సుధారసమనేది సుఖానికి- విషరసమనేది దుఃఖానికి ప్రతీక. రెండింటి నడుమా బిందుస్థానంలో వర్తిస్తూ ఆ దేవి ఈ జీవుడి లాగా సుఖం చేత గాని దుఖం చేత గాని స్పృశించ బడదు. కారణం సామ్యావస్థలో ఉండటమే. సామ్యావస్థే మూల ప్రకృతి. అంచేత సుఖదుఃఖాదుల చేత నియమించబడదు. మీదుమిక్కిలి వాటినే తాను నియమించ గలదు. ఇలాంటి మాహాత్మ్యం కలిగిన ఆ దేవీ స్వరూపాన్ని పట్టుకో లేక ఈ జీవుడు దానికి భిన్నంగా సుఖదుఃఖాలకే పట్టుబడుతున్నాడు. వాటితో యావజ్జీవమూ పరితపిస్తున్నాడు.

  ఇంత మాత్రం తోనే దేవీ యాత్ర ముగియ లేదు. సాగరం లాగా ఈ సంసార మండలాన్ని ప్రసరింప జేసి ఇందులో ఒక కదంబ వనాన్ని గూడా ప్రతిష్ఠించింది. ఏమిటీ కదంబ వనం. మరేదో గాదు. జీవుల తాలుకు ఏ వాసనా ప్రపంచముందో అదే కదంబ వనం. వృక్షాల లాగా అనేక జన్మలనుంచి సంచితమైనవి వాసనలైతే- వనం లాగా వాటికాశ్రయమైనది మన ఆశయం. కదంబమనేది మంచి వాసనకు నిలయమైన వృక్షమని లోకంలో ప్రసిద్ధి. దాని లాగా సుఖదుఃఖాది వాసనలు కూడా యావజ్జీవమూ ఈ ప్రాణులను అంటి పట్టుకొని ఉంటాయి. ఎప్పటికి విడిచి పెట్టవు. జన్మాంతరాలలోకి కూడా సంక్రమిస్తాయి.

Page 51

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు