పూర్వార్ధము - అవరోహణ క్రమము
మూడు దశలకూ అతీతంగా తురీయమైన దశ అది. తురీయమంటే నాలుగవదని అర్థం.
వాస్తవంలో తురీయమని గూడా దీనిని పరిగణించరాదు. మూడుదశలున్నప్పుడే నాలుగవదనే దానికి అవకాశం. అసలు జాగ్రదాదులైన మూడు దశలే యధార్థంగా లేవు. చైతన్య వ్యతిరిక్తంగా ఏ ఒక్క దశా లేదని గదా చెప్పాము. ఉన్నట్టు కనిపిస్తున్నవే గాని నిజంలో అవి మిథ్యా భూతమే. అవి మిథ్య అయినప్పుడు తురీయమనే మాటకిక అర్థమేముంది. అయినప్పటికి జీవుడి దృష్టిని బట్టి చెప్పవలసి వస్తున్నదీ అవస్థా చతుష్టయం. అందులో జాగ్రత్స్వప్న సుషుప్తులనే మూడు దశలనూ యధార్థమని భావిస్తూ జీవుడీ సంసార క్లేశమను భవిస్తూ వీటికి విలక్షణంగా తురీయమనే దశ ఒకటి ఉందని దానిని అందుకోవాలని కోరుతుంటాడు. అంతే గాని నాలుగు దశలూ తురీయమేనని గుర్తించటం లేదు. ఈ గుర్తించటం ఎంత వరకు జరగదో అంత వరకూ ఆ దేవి తిరోధానమనే కాలపాశం నుంచి మనకు విముక్తి లేదు. మీదు మిక్కిలి ఆ పాశం మనల నంతకంతకు చుట్టి పడవేస్తూనే ఉంటుంది.
34. భవచక్ర ప్రవర్తినీ
అది ఎలాగని అడిగితే చెబుతున్నదీనామం భవచక్ర ప్రవర్తినీ అని. భవమంటే జన్మ. భవమంటే సంసారం. సంసారమనేది చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. కనుకనే దీనికి సంసారమని పేరు పెట్టారు. సంసరతీతి సంసారః. అవిచ్ఛన్నంగా ఒక చక్రంలాగానే పరిభ్రమిస్తుంటుందని భావం. ఈ చక్రంలో చిక్కుబడి పోయాడి జీవుడు. దీని నుంచి బయట పడలేక
Page 49