పూర్వార్ధము - అవరోహణ క్రమము
ప్రకాశిస్తున్నాడట. వాయ్వాది దేవతలకే దిక్కులేనప్పుడిక మానవమాత్రుల మాట చెప్పేదేముంది. అంచేత మనమే కర్తలన్నింటికి అనే అభిమానాన్ని దూరంగా పరిత్యజించి ఆ మహా శక్తి శాసనాన్ని అనుసరించి పోవటం ఎంతైనా శ్రేయస్కరం.
24. పంచకృత్య పరాయణా
పోతే ఆ పరా భట్టారిక శాసనమెలాంటిది- ఎలా శాసిస్తున్నదీ ప్రపంచాన్ని- అనే విషయాన్ని వర్ణిస్తున్నదీ నామం. ఆవిడ పంచకృత్య పరాయణ. పంచకృత్యాలంటే ఐదు పనులు. ఆ ఐదు పనులూ చేయటమే పరాయణం. ఆవిడ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించటానికే పరా రూపిణి అయిన ఆ శక్తి వైఖరి వరకూ ప్రయాణం చేసి వచ్చింది. సృష్టి స్థితి సంహారం - తిరోధానం అనుగ్రహం- అనేవే ఆ పంచకృత్యాలు.
వీటిలో సృష్టి స్థితి లయాలనేవి మూడూ ఆ దేవి జగదాత్మ కత్వాన్ని తెలుపుతున్నాయి. ప్రపంచ రూపంగా పరిణమించింది. ఆవిడే గదా. పోతే తిరోధాన అనుగ్రహాలనేవి రెండూ ఆవిడ జగన్నియామకత్త్వాన్ని చాటుతున్నాయి. తన చైతన్య శక్తిని సంకోచింప జేసుకొని ఆవిడ ఈ జీవకోటిని సృష్టించింది. సంకోచ కారణంగా వీరి జ్ఞానైశ్వర్యాలను తిరోహితం చేసింది. ఇదే తిరోధానమంటే మరలా క్రమంగా వికసింప జేస్తూ ఈ జీవ కోటిని ఆవిడే అనుగ్రహిస్తుంది. అప్పుడు తిరోహితమయిన జ్ఞానైశ్వర్యాలు పరిపూర్ణత చెంది జీవుడు తరించ గలడు. తిరోధాన అనుగ్రహాలు ఆవిడ నిరంకుశంగా చేయటం లేదు. జీవులు చేసుకొన్న సుకృత దుష్కృతాల కనుగుణంగా ఆవిడ సాగించే
Page 43