#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

రూపాలుగా ఆ దేవి జడ శక్తే పరిణమించి మనకు కనిపిస్తున్నది. రూపాలుగా పరిణమించటంలో ఆ శక్తి ఉపాదానమయితే - అలా పరిణమించాలనే సంకల్పంతో లేదా ప్రయత్నంతో ఆ శక్తి నిమిత్తమయింది. ఇంతకూ చేతనాచేతన ప్రపంచమంతా సృష్టిచాలని సంకల్పించింది అదే. సంకల్పానుగుణంగా మారి కనిపిస్తూ ఉన్నదీ అదే.

15. అనేక కోటి బహ్మాండ జననీ

  ప్రతి ఒక్క పదార్థంలోనూ లోపల మరుగు పడి ఉన్న చైతన్య భాగమూ అదే - పైకి కనిపించే జడభాగమూ అదేనని తీర్మానించాము. ఇందులో నిమిత్తకారణంగా చేతనం. ఉపాదానంగా జడం. అప్పటికి చేతనాచేతన జగత్తంతా శక్త్యాత్మకమే అయి కూచుంది. కాగా ఈ జడసృష్టి ఎలా జరిగిందో - చేతన సృష్టి ఎలా జరిగిందో రెండు నామాలు మనకు ప్రపంచించి చెబుతున్నాయి. అందులో మొదట జడ సృష్టి ఎలా జరిగిందో విందాము

  బ్రహ్మాండమంటే ఆకాశం. అదీ ఒకటి గాదు కోటి. ఒక కోటి గాదు అనేక కోట్లు. అసంఖ్యాకమని అర్థం. అందులో మనకు గోచరమవుతున్నదొక ఆకాశం. ఇది మనలను చుట్టూ వాటేసుకొని ఉంది. ఈ బ్రహ్మాండంలో తిరుగున్నాయి లెక్కలేనన్ని అండాండాలు అంటే సూర్య గ్రహ చంద్ర నక్షత్రాది గోళాలు. వాటిలో ఒకటి మనం నివసించే ఈ భూమండలం. దీనిలో మరలా పరిభ్రమిస్తున్నాయి మన శరీరాలనే పిండాండాలు. ఇవి ఎనభై నాలుగు లక్షల జీవ రాసులని పేరు. రాసులే ఇవి. ఒక్కొక్క రాశిలో కోటాన కోట్లు జీవ శరీరాలు.

Page 34

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు