పూర్వార్ధము - అవరోహణ క్రమము
వస్తుతః ప్రమేయమని భావించే ఈ ఉపాధులెక్కడా లేవు. దేని మీద ఆరోపించటమూ లేదు. ద్వైతరూపమైన ఆరోపణ చూచి చూచి దానికి బాగా అలవాటు పడిందీలోకం. అలాటి లోక దృష్టితో చూచి ఈ ప్రపంచం కూడా ఒక ఉపాధి అని ఇది ఆ చైతన్యం మీద ఆరోపితమయిందని వ్యవహరిస్తున్నాము. నిజంలో ఇది దానికి భిన్నంగా లేనూ లేదు. ఆరోపితం కానూ లేదు. దానిచేతనే గ్రహించబడవలసినప్పుడు- దాని స్పర్శ లేకుంటే అస్తిత్వానికే నోచుకోనప్పుడు- ఇవి ఎక్కడ ఉన్నాయని. ఎలా ఆరోపితమయ్యాయని. అంచేత ఇవి ఇలా కనపడుతున్నాయే. ఏమిటా ఎలాగా అని ఆశ్చర్యపడరాదు మనం. ఇవి కాదు కనపడట మసలు. చైతన్యమే ఈ ఉపాధుల రూపంలో మనకు దర్శనమిస్తున్నది. ఒక సముద్ర జలమే తరంగ ఫేన బుద్బుదాది రూపాలలో భాసించినట్టు భాసిస్తున్న దీనామ రూపాత్మక ప్రపంచమంతా. చైతన్యమే సర్వోపాధులూ కనుకనే సర్వోపాధి వినిర్ముక్త ఆ శక్తి. అంటే ఉపాధులేవి లేవు. శక్తి ఒక్కటే ఉన్నదని భావం.
10. మహామాయా
మరి ఈ ఉపాధులన్నీ అసత్యమయితే ఇవి మనకు కనపడరాదు గదా. లేనిపదార్థమెక్కడైనా కనపడుతుందా. కుందేటి కొమ్మును గాని వంధ్యాకుమారుని గాని ఎవరైనా చూచారా. చూడ గలరా. అలాగే శశవిషాణం లాంటి ఈ ప్రపంచాన్ని కూడా చూడలేము గదా మనం. అయినా చూస్తున్నామే అనుక్షణం. లేనిదయితే ఎలా చూడగలమని మరలా ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానమే ఈ నామం. మహతీచ సా మాయాచ ఇతి .
Page 24