పూర్వార్ధము - అవరోహణ క్రమము
5. చిదేక రస రూపిణీ
చైతన్యం శక్తి అని రెండు మాటలు దొరలే సరికి రెండు __ వస్తువులున్నవేమో నని ఒక భ్రాంతి ఏర్పడవచ్చు చాలా మందికి. అలాంటి భ్రాంతి ఎవరుగాని పరవిద్యావిషయంలో పెట్టుకోరాదు. ఎందుకంటే వస్తువనేది ఇక్కడ ఒక్కటే. చైతన్యమైనా అదే. శక్తి అయినా అదే. చైతన్యానికి చెందినదే గనుక శక్తి దానికెప్పుడూ భిన్నంకాదని చెబుతూనే వచ్చాము. ఆ భావాన్నే ఈ నామం మనకు చక్కగా బయటపెడుతున్నది. రసమనగా స్వభావం. ఏకరసమంటే ఒకే స్వభావం. చిత్తంటే సైతన్యం, చైతన్యానికి ఏది స్వభావమో అదే దాని శక్తికి కూడా స్వభావమని అర్థం. చైతన్య స్వభావం కాక వేరొక స్వభావం అంటూ దానికి లేదు. కాబట్టి చైతన్యమొకటి శక్తి ఒకటి రెండు వస్తువులని భ్రమపడరాదు రెండు మాటలు చెవిన బడుతున్నా రెండూ కలిసి చెప్పే అర్థం ఒక్కటే. అగ్ని జ్వాలా అనటం లాంటిదిది. అగ్ని జ్వాలా అగ్నియే గాని వేరుగాదు.. అయినా అగ్ని అని జ్వాల అని రెండుమాటలు వినిపిస్తుంటాయి. రెండు మాటలే గాని ఒక్కటే అర్థం. అందులో జ్వాలా అనేది నామామాత్రమే. వస్తుతః అది అగ్ని తత్త్వమే. అగ్నియే ఒకప్పుడు అగ్ని అని ఒకప్పుడు జ్వాల అని పేర్కొనబడుతున్నది. అలాగే అక్కడ అగ్ని లాగా చైతన్యమనే ఒకే ఒక తత్త్వం చిత్తని చిచ్ఛక్తి అని రెండు విధాలుగా వ్యవహరించబడుతున్నది. అగ్నికి జ్వాలలాగే చిత్తుదే చిచ్ఛక్తి. శక్తి శక్తిమంతులకు భేదంలేదని ముందే పేర్కొన్నాము. లేదు గనుకనే శక్తి అని వ్యవహరిస్తున్నా అది వస్తుతః చిద్రూపిణే. దానికదనంగా మరిఏ రూపమూ దానికున్నట్టు మనం అపోహ పడరాదు. చైతన్యమే శక్తి అని కూడా భావిస్తూపోవాలి సాధకుడు.
Page 16