#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

4. చిదగ్ని కుండ సంభూతా

  బ్రహ్మవిద్యా రూపిణి అయిన శక్తే శివసాయుజ్య ప్రాప్తికి ఆలంబనమని నిర్ధారణ చేయటంలో ఏమిటి ఉపపత్తి అని అడిగితే దానికి ఈ నామం సమాధానం చెబుతున్నది. శక్తి అనేది చిదగ్నికుండ సంభూత. చిదగ్ని కుండమంటే అగ్ని కుండంలాంటి చైతన్యమని అర్థం. చైతన్యమే రాశీ భూతమైతే అదే అగ్నికుండం. దానికే శివమని నామాంతరం. అలాంటి శివచైతన్యంతో సంభూతా అంటే అవినాభూతంగా ఏకమై ఉన్నదేదో అది చిదగ్ని కుండ సంభూతా. ఒక్క క్షణం కూడా చైతన్యాన్ని ఎడబాయదాశక్తి. అలా ఎడబాయటం సంభవం కూడా కాదు. అలాగే అయితే అది జడత్వాన్ని పొందవలసి వస్తుంది. జడానికి చైతన్య ప్సర్శ లేకుంటే అది అప్రమాణమవుతుంది. ప్రమాణానికి ఏది గోచరించదో అది ఉందని చెప్పలేము. ఆకాశం మొదలు భూమండలం వరకూ ఏ ఒక్క పదార్ధం గాని ప్రమాణం చేతనే స్సిద్ధించవలసి ఉంది. చైతన్యమొక్కటే ప్రమాణంకోరని స్వతసిద్ధమైన పదార్ధం. కారణమేమంటే అదే అన్నింటికీ ప్రమాణం. అంచేత శక్తి కూడా సిద్ధించాలంటే స్వతసిద్ధమైన చైతన్యాన్ని వదలి దూరం పోరాదు. దానితో అవిభక్తంగానే బ్రతుకు సాగించాలి. అదే సంభూతా అనే మాట మనకు సూచిస్తున్నది. సంభవమంటే జన్మించటమని కొందరర్థం చెబుతారు. అది పొరబాటు. సంభవమనే మాటకు అసలైన అర్థం కలయిక. లాక్షణికమైన అర్థమే జన్మ అనేది. ఇక్కడ ముఖ్యార్ధంలోనే ఈ మాటకు మనం అర్థం చెప్పుకోవలసి ఉంది.

Page 15

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు