సింహావలోకనము
రా అనే రెండక్షరాలను కలుపుకొని వీడు సంసార కారలో ప్రవేశించాడని ముందు చెప్పాము. ఇప్పుడు దానికి ప్రతిలోమంగా ప్రహర్షితా అనే నామంలోని కడపటి తా వర్ణం గణేశ్వరా లోని రా వర్ణం తో చేర్చి తారా అని ఈ సంసార తార లేదా తరణాన్నే చెందగలడని ధ్వనిస్తున్నది. కార అవిద్య వల్లనైతే- తార విద్య వల్ల. ఇదే గణేశుడికి కలిగే గొప్ప సిద్ధి. బుద్ధి వల్లనే సిద్ధి. అది మహాబుద్ధి అయితే మహా సిద్ధి. శివాకారమైన బుద్ధే మహా బుద్ధి. దానికి తగిన శివ తాదాథ్మ్యమే మహా సిద్ధి. ఇవి రెండూ లభిస్తాయి ఈ గణేశ్వరుడికి. ఈ గొప్పభావాన్ని మనస్సులో ఉంచుకొని వర్ణించినవే శివ పురాణాదులలో గణపతికి బుద్ధి- సిద్ధి అనే భార్యలిద్దరు న్నారనే కధలు.
అయితే మహా బుద్ధి అని వర్ణించారు గదా. దాని వల్ల గదా మహా సిద్ధి మనకు. అది ఎలా సాధించాలని ఇప్పుడు ప్రశ్న. ఇంతకు ముందే పేర్కొన్నామొక మాట విమర్శ అని. నిరంతర విమర్శనమే దాని కుపాయం. ఏది విమర్శిస్తుందో అది నామం. దాని చేత విమర్శించబడేది రూపం. ఇవే శబ్దార్థాలు. శివ శక్తులు కూడా ఇవే. శబ్దరూపం శక్తి అర్థరూపం శివ. శబ్ద రూపమైన శక్తి విమర్శిస్తుంది. అర్థ రూపమైన శివం ప్రకాశిస్తుంది. స్థూలం మొదలు అతి సూక్ష్మం వరకు ప్రపంచాన్నంతటినీ విమర్శించేది శబ్దమే. అలా విమర్శిస్తూ పోతే అర్థం కూడా శబ్దమై మరలా వేరొక అర్థాన్ని విమర్శస్తుంది. ఉదాహరణకు పృథివీ అనే శబ్దం స్థూలమైన ఈ భూమిని చెబుతుంది. ఆ భూమి అంతటిలో నిలవదు. అది మరలా జలాన్ని చెబుతుంది. అది తేజస్సునూ. అది వాయువునూ. ఆ వాయువాకాశాన్నీ.
Page 128