ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
ఈ అభ్యాస మనేది ఇన్ని మార్లని కాదు ఇంత కాలమనీ కాదు. ఫలితం కలిగే వరకూ అభ్యసించ వలసిందే. కనుకనే దీర్ఘకాలం నిరంతరం శ్రద్ధా భక్తులతో సాగించ మని పతంజలి ఉపదేశం. -అలాగైతేనే అది పరిపాకానికి రాగలదు. అభ్యాసం పరిపక్వమైతే ఫలం కలగటానికి ఆలస్యం లేదు. తీవ్ర వేగంతో కృషి చేసే వారికి అది ఆసన్నతమ మని ఆయనే చాటి చెప్పాడు. అక్షరాలా నిజమిది. ఒక గాయకుడు ఎంత తీవ్రమైన కృషి సాగిస్తే అతనికి సంగీతమంత వశవర్తి అవుతుంది. ఒక సూపకారుడు ఎంత పాటుపడితే పాక కళ అంత అతనికి హస్తగతమౌతుంది. అలాగే ఇక్కడ కూడా నిత్యమూ ఈ అనాత్మ జగత్తును ఆత్మ చైతన్య రూపంగా భావించే పురుషుడికి అవశ్యంగా భావన పాకానికి రాక తప్పదు. వస్తే అప్పటినుంచీ అనాత్మ జగత్తంతా ఆత్మగానే పరిగణించి – దానితో వ్యవహరిస్తున్నా- అతని బ్రహ్మ నిష్ఠ ఎప్పటికీ దెబ్బ తినదు.
39. మైత్ర్యాది వాసనా లభ్యా
అందుకే ఇలాంటి పరిపాకం చెందటానికి మొదటి నుంచీ ప్రయత్నిస్తూ పోవాలి మానవుడు. మానవుడి మనసులో నానా విధమైన అశుభ వాసన లెన్నో పేరుకొని ఉంటాయి. అవి మనం జన్మ జన్మాంతరాలనుంచీ పోగు చేసుకొన్న సరకు. అవే మన శ్రేయో మార్గాని కడ్డు తగులుతున్నాయి. ఇవి ఇలా ఉన్నంత వరకూ జ్ఞానానికే నోచుకోలేము. ఇక నిష్ఠ మనకెంత దూరం. అంచేత మొట్టమొదట మనమీ వాసనలకు వీడ్కోలు చెప్పవలసి ఉంది. దాని కుపాయ మొక్కటే. వాటికి ప్రతి ద్వంద్వి అయిన శుభ వాసనలను అలవరచుకోవటం. అవే మైత్ర్యాది వాసనలు. మైత్రి- కరుణ-ముదిత- ఉపేక్ష- అని యోగ శాస్త్రాలలో నాలుగు
Page 108