#


Index

  అందుకే మృగాదులను శిక్షించే భారం రాముడిమీద ఉంది. మరి మృగాలకు మానవ ధర్మమెలా వర్తిస్తుందని గదా ప్రశ్న. మృగ రూపాలలో ఉన్నారనే గాని వాలి సుగ్రీవులు మిగతా జాతి మృగాల లాంటి వారు కారు. రాజులై రాజ్యాలు చేస్తున్నారు. మానవులతో వ్యవహరిస్తున్నారు. కామరూపాది శక్తులున్నాయి వారికి. అందుకే నరుడిలాగా సంబోధిస్తాడు వానరుణ్ణి కూడా రాముడు. అయితే మృగాలను వేటాడటం మాకు ధర్మమని చెప్పే మాటకర్థ మేమిటని మరలా ప్రశ్న. మృగ స్వభావమే ఇక్కడ మృగమంటే. మృగాకృతిలో ఉన్నా మృగాతీత శక్తులతో విజ్ఞానంతో వ్యవహరించినంత వరకూ పరవాలేదు. కాని అవన్నీ ఏరదోలి కేవల ఉపాధి ధర్మాన్నే అనుసరించాడు వాలి. అంచేత మృగయా వ్యవహారాన్నే పాటించాను పొమ్మన్నాడు రాముడు.

  మరి చాటునుంచి ప్రయోగించటం దేనికి బాణం. వాలి ఎదుటికి రావటానికి భయమా. అదేగా అన్నాడు వాడు. నీవు చాటునుంచి కొట్టావు కాబట్టి బ్రతికిపోయావు గాని నా కంటపడి ఉంటే చచ్చేవాడివని. అది కేవలం వాడి ఔద్ధత్యాన్ని సూచిస్తుంది గాని అర్థవంతమైన మాట గాదు. ఎందుకంటే చాటునుంచి వేసినా ఎదుటబడి వేసినా రామబాణం రామ బాణమే. దాని కెదురులేదు. వాలికాదు. ఎవరూ చెప్పలేరు దానికి జవాబు. పరశురాముడే చెప్పలేకపోయాడు- వాలి ఏమిటిక లెక్క సప్త సాలాలు ఒక్కదెబ్బలో భంజించిం దాబాణం. ఎదుటబడి వేసినా ఒక్కటే. చాటు నుంచి వేసినా ఒక్కటే. ఎలా వేసినా గురి తప్పని దది. ఇది రాముడి బాణమని కూడా కాదు మనం చూడవలసిందిక్కడ. రామ వేషంలో ఉన్న పరమాత్మ బాణం. దేవుడి బాణం మనకెప్పుడూ చాటు నుంచే వచ్చి తగులుతుంది. ఎప్పుడెక్కడి నుంచి వచ్చి తగులుతుందో చెప్పలేమా దెబ్బ. ఎవరికీ తెలీకుండా చేశాము గదా ఈ పని అని సంతోషిస్తుంటాడు జీవుడు. కాని సర్వాంతర్యామి అయిన దేవుడన్నీ కనిపెట్టి చూస్తూనే ఉంటాడు.

Page 84