#


Index

  ఇలాటి రాక్షసి రాముడి దగ్గరికి వచ్చింది. వచ్చి నీవేమిటి. చూస్తే తాపసుడిలా ఉన్నావు. భార్యతో ఉన్నావు. శరచాపాలు ధరించావు. నీవెవరు. ఎందుకిక్కడికి వచ్చావని అడుగుతుంది. అంతవరకు బాగానే ఉంది. అది రాక్షసి అని గ్రహించినా తొందరపడలేదు రాముడు. సవ్యంగా అడిగింది కాబట్టి సవ్యంగానే జవాబిచ్చాడు. ఋజుబుద్ధితయా సర్వ మాఖ్యాతు ముపచక్రమే- అంటాడు వాల్మీకి. నిజాయితీతో ఏదీ దాచకుండా ఉన్న విషయం చెప్పాడట. బుజుబుద్ధి అనే మాట ఇక్కడ గమనించ దగిన మాట. తన కథ అంతా సంగ్రహంగా చెప్పాడు దానికి. చెప్పి నీవెవరు ఎందుకిక్కడికి వచ్చావు-అని దాన్ని మరలా ప్రశ్నిస్తాడు. అది కూడా ఉన్నవిషయమే చెబుతానని చెబుతుంది. రావణుడు నా అన్న అతడి పేరీపాటికి నీ చెవికి కూడా వచ్చి ఉండవచ్చు. కుంభకర్ణుడని ఒక సోదరుడు. నిద్రాళువు, విభీషణుడని ఇంకొక భ్రాత. రాక్షసుడైనా రాక్షసస్వభావుడు కాడు. ధర్మాత్ముడు. మరి ఖరదూషణులని మరి ఇద్దరు సోదరు లున్నారిక్కడే. ఇంతవరకూ బాగానే మాట్లాడుతూ వచ్చింది. ఇక్కడనుంచే చెడింది దాని వ్యవహారం వాళ్లనందరినీ విడిచివచ్చాను - నీ రూపమపూర్వంగా కనిపిస్తే మోహించాను. నన్ను పెండ్లాడు. నాకు చాల శక్తులున్నాయి. నేనే నీకు తగినదాన్ని. సీతయాకిం కరిష్యసి-ఈసీతతో ఏమి చేస్తావు. వికృతాచ విరూపాచ నచేయం సదృశీతవ-ఇది వికృత విరూప-ఇలాంటిది నీకు తగినదికాదు. ఇదుగో దీన్ని నీ తమ్ముడితో సహా ఒక్క క్షణంలో మ్రింగి పారేస్తాను. ఆ తరువాత మనమక్కడా ఇక్కడా హాయిగా తిరగవచ్చు. అంటుంది.

  ఇదుగో ఇక్కడే చిక్కు. అంతవరకూ బాగా మాట్లాడిందిప్పుడీ ఆసందర్భపు మాటలేమిటి. ఆయన చెబుతున్నా డొకప్రక్క., ఈ విడ నాభార్య-ఇతడు నా తమ్ముడని. భార్య అన్నప్పుడు పెండ్లయిందనేగదా. పెండ్లయిన వాడిని నన్ను పెండ్లాడ మనటమేమిటి. పైగా ఆయన భార్యను పట్టుకొని విరూప వికృత అనటమేమిటి.

Page 72