#


Index

ధర్మ సూక్ష్మములు

  సమస్త ధర్మాలూ కరగించి కరువుబోసిన విగ్రహమే శ్రీరాముడని ఎంతగానో కీర్తించాము. మనం ఉత్తమ ధర్మాలని రాముడిలో ఎత్తి చూపిన వాటినే ధర్మాభాసలని కొందరు వేలెత్తి చూపుతున్నారు. మీదుమిక్కిలి ఉదాత్తనాయకుని కుండవలసిన లక్షణా లక్కడక్కడ కొరవడ్డాయని కొన్ని బలహీనతలను కూడా అంటగడుతున్నారు.

  అందులో మొదటిది రాముడు సీతా లక్ష్మణసమేతంగా అడవికి వెళ్లిన తరువాత మొదటి రోజు రాత్రి అక్కడ నిద్ర పట్టక ప్రక్కనే ఉన్న లక్ష్మణుణ్ణి చూచి తన తండ్రి దశరథుణ్ణి గూర్చి అన్న మాటలు. అవి ప్రశంసిస్తూ అన్న మాటలు కావు. అధిక్షేపిస్తూ, కోహ్యవిద్వానపి పుమాన్ ప్రమదాయాః కృతేత్యజేత్-ఛందానువర్తినమ్ పుత్రమ్ - తాతో మామివ లక్ష్మణ-అర్ధధర్మౌ పరిత్యజ్య యః కామమనువర్తతే-ఏవమాపద్యతేక్షిప్రమ్-రాజాదశరధోయథా అనాథశ్చహివృద్ధశ్చ- మయాచైవ వినాకృతః కింకరిష్యతి కామాత్మ-కైకేయ్యా వశమాగతః- మన్యే దశరథాంతాయ మమ ప్రవ్రాజ నాయచ-కైకేయీ సౌమ్యసంప్రాప్తా- రాజ్యాయ భరతస్యచ-లక్ష్మణా చూడు. ఎంత మూర్ఖుడైనా ఒక తండ్రి ఆడదాని మాటలు విని గుణవంతుడైన పుత్రుణ్ణి అడవుల పాలు చేసే వాడుంటాడా- ఒక మన తండ్రి దశరథుడు తప్ప. అర్థ ధర్మాలు రెండూ గాలికి వదిలేసి కామమే పురుషార్ధమని ఎవడు గట్టిగా పట్టుకొంటాడో వాడు దశరథుడిలాగే దెబ్బ తింటాడు. అయినా అనాథుడూ-వృద్ధుడూ నన్నూ దూరం చేసుకొన్నాడు. కైకేయి చేతులలో కీలు బొమ్మ అయ్యాడు. ఏమి చేయగలడు పాప మారాజు. అసలు నేననుకొంటాను దశరథుడి వినాశానికీ • నా ప్రవాసానికీ-భరతుడికి రాజ్యం కట్టపెట్టడానికీ- సంప్రాప్త మయింది ఆ తల్లి కైకేయి.

Page 65