#


Index

  బహుశా యోగ భ్రష్టులయి ఉంటారా మహానుభావులు, పూర్వమెప్పుడో యోగాభ్యాసం చేసి చేసి అది ఫలించ కుండానే మరణించి ఉంటారు. "అధవా యోగినా మేవకులే భవతి” అన్నట్టు దాని ఫలితంగా ఈజన్మలో యోగీశ్వరేశ్వరుడైన కృష్ణ భగవానుడి వంశంలో వచ్చి పడిఉంటారు.

  ఇందులో ఉద్దవు డాయన కమాత్యుడూ - ఆచార్యుడూ - ప్రాణ స్నేహితుడూ అయితే - అక్రూరుడు వరుసకు తండ్రిలాంటి వాడాయనకు. బంధుండవు సద్యోహిత సంధుండవు - వావిజూడ జనకుడవని కృష్ణుడే అంటాడా మాట. అయినా పరమాత్మకు తండ్రులేమిటి. తల్లులేమిటి. అది ఒక నటన. అందరూ ఆయనకు భక్తులే. తదీయ గుణగణాసక్తులే. అలాంటి వాడే ఈ అక్రూరుడు. క్రూరుడు కాని వాడక్రూరుడు. అయన పేరే చెబుతున్న దాయన ఎంత సౌమ్య స్వభావుడో. అయితే అక్రూరుడైనా క్రూరుడైనా కంసుణ్ణి కాదనలేక పోతాడు. సరిగా రామాయణంలో విభీషణుని లాంటివాడు. భీషణుడు కానివాడు విభీషణు డయినట్టే క్రూరుడు కాని వాడక్రూరుడు. అన్నగారి దుండగా లాయన సహించినట్టే సహించాడు అక్రూరుడు కూడా కంసుని దుండగాలు. ఆయన చివర కన్నను కాదని వెళ్లిపోయినట్టే ఈయనా సందేశమనే నెపంతో కంసుని పట్టణం విడిచి వెళ్లిపోయాడు.

  కృష్ణుడు వ్రేపల్లెలో ప్రచ్ఛన్నంగా వసిస్తున్నాడని నారదుడు చెప్పగా విని దానికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకొన్న తరువాత ఏలాగైనా రామకృష్ణులను దగ్గరికి రప్పించి వారిని మట్టు పెట్టదలచాడు కంసుడు. అందుకోసం ధనుర్యాగమనే ఒక మిష కల్పించాడు అప్పుడ క్రూరుణ్ణి పిలిపించి బుజం మీద చేయి వేస్తూ ఇలా అంటాడు. "అక్రూరత్వము తోడ నీవు మనగా నక్రూరనామంబు నిర్వక్రత్వంబునఁ జెల్లె మైత్రిసలుపన్ వచ్చున్ నినుంజేరి నీ వక్రోధుండవు" కనుక నిన్ను పంపుతున్నాను. నీవు పోయి బలరామ కృష్ణులను నాకు తెచ్చి ఒప్పగించ మంటాడు. చూడండి.

Page 177