మనకు. అలాగే లౌకికమైన ఈ గోపికా కృష్ణుల శృంగారమంతా లోకోత్తరమైన శృంగారానికి ఒక ఛాయ, అయితే ఏమిటా లోకోత్తరం అని అడగ వచ్చు. అదే జీవేశ్వరుల పరస్పర సంబంధం. గోపిక లంటే ఎవరో కాదు. జీవులే. గోపికా వల్లభుడైన కృష్ణుడా ఈశ్వరుడే. సహజంగా జీవుడు పరిపూర్ణుడు కాడు. కనుక పురుషుడు కాదతడు. స్త్రీ. ఈ స్త్రీ పరిపూర్ణత నందు కోవాలంటే పూర్ణ పురుషుణ్ణి భజించాలి. ఆ స్వరూపంతో ఏకత్వం భజించాలి. "సతా సోమ్య తదా సంపన్నో భవతి" - అంటున్న దుపనిషత్తు. అంతే కాదు. “యథాస్త్రియా సంపరిష్వక్తో - న బహిర్వేద - నాంతర”మ్మని లోకంలో స్త్రీ పురుష వ్యవహారాన్నే జీవేశ్వరైక్యాని కుపమానంగా వర్ణిస్తుంది.
దీనిని బట్టి గోపికా కృష్ణుల వ్యవహార మెట్టిదో ఇక మనం బాగా అర్థం చేసు కోవచ్చు. పైకి భౌతికంగా అశ్లీలంగా కనిపించినా అది అభౌతికం. ఆదర్శప్రాయం. బాల్యం నుంచీ కృష్ణుడు వారి పట్ల చేసిన అల్లరి చేష్టలన్నీ భగవంతుడు భక్తులను అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొలపటమే. వారిని రెచ్చ గొట్టటమే. తన ఉనికి నెఱిగించటమే. ఎలయించటమే. అది గమనించారా గోపికలు కొంతకాలానికి. ఆయనసాంగత్యంకోస మాసించారు. తమ సర్వస్వమూ సమర్పించారు. క్షణమాలస్య మైతే భరించలేక పోయారు. కనిపించకపోతే కలవరపడ్డారు. అయితే నిజంగానే వీరు తనకు సర్వస్వమూ అప్పగించారా లేదా అని ఆ పరమాత్మ వారిని తాను కూడా పరీక్షిస్తుంటాడు. అలాంటి ఒక పరీక్షే వస్త్రాపహరణం. లోతుకు దిగకుండా పైకి చూస్తే ఇది మహా బూతు. రౌడీ చేష్ట. కాని భౌతికం కాదని గదా ముందే చెప్పాము. భౌతికమైన ఈ తెరమరుగున ఎంతో ఆధ్యాత్మిక మైన భావ మున్నది. ఏమటది. వస్త్ర మంటే జీవులకున్న దేహాభిమానం. అది ఉన్నంత వరకూ ఈశ్వర సాయుజ్యానికి నోచుకోలేదు. జీవుడు తన పాటికి తాను వదులుకో లేడది. ఈశ్వరాను గ్రహం కూడా తోడు కావాలి దానికి. అందుకే వారి నేమరించి వారి వస్త్రాలపహరించాడు కృష్ణుడు. నీళ్లలో నుంచి ఇవతలికి రమ్మన్నాడు.
Page 168