వారు పురుషో పాధిలో ఉన్న దేవతలు. వీరు స్త్రీ ఉపాధులలో ఉన్న దేవ కన్యలు. కనుకనే సగుణంలో కూడా వారిది దాస భక్తి - సఖ్య భక్తి అయితే - వీరిది కామ భక్తి. కామోత్కంఠత గోపికల్ అని గదా భాగవత వచనం. కామ మంటే ఇక్కడ స్త్రీ పురుష సంబంధం. ఇది కేవలం లౌకికమైతే గర్హణీయం. పరమేశ్వర విషయం కాబట్టి ప్రశంసనీయ మయింది. పరమేశ్వరు డొక్కడే వారి దృష్టిలో పురుషుడు. పూర్ణత్వ మున్న వాడెవడో వాడు పురుషు డంటే. అలాంటి పూర్ణత్వం భగవంతుడికిగాక మరెవరికి. కనుకనే పురుషుడైనా పురుషోత్తముడైనా వాస్తవానికా భగవానుడే. మరెవరూ కాదు. కాదు గనుకనే తమ తమ భర్తలను అత్త మామలను ఎవరినీ లెక్క చేయక ఇది లోక నింద్య మని కూడా సంకోచించక కృష్ణుని వెంటబడి పోయారా గోపికలు. పైగా ఆయనే సంకోచించి మీరేమిటిలా నామీద దాడి చేస్తున్నారు. మీకు భర్తలులేరా-అత్తమామలు లేరా వారా గ్రహించరా లోకు లాడి పోసుకోరా - అని ప్రశ్నిస్తే కూడా భర్త లేమిటి బంధువు లేమిటి అంతా నీ స్వరూపమే గదా నీలోనే మేమీ ప్రపంచాన్నంతా చూస్తున్నప్పుడిక మాకు పాపమేమిటని - సమాధాన మిస్తారు. భక్తిలో ఇది పరాకాష్ఠ. దీనినే మధుర భక్తి అంటారు భక్తి తత్త్వ విశారదులు.
మధుర భక్తి ఏమిటి. మామూలు భక్తి కాదా ఇది. కాదు. మామూలు భక్తి పురుషులకు పురుషోత్తముడి మీద అయితే - ఇది స్త్రీలకా పురుషోత్తముడి మీద, వాస్తవానికి పురుషు డొక్క పరమాత్మే నని చెప్పాము. ఆ దృష్టితో చూస్తే లోకంలో ఉన్న స్త్రీ పురుషులంతా స్త్రీలే. అయినా ఆ భావం పురుషులకు కలగటం కష్టం. వారి పురుషోపాధి వారి కడ్డం వస్తుంది. స్త్రీలకైతే అలాంటి చిక్కులేదు. వారి శరీరాలు స్త్రైణాలే కాబట్టి సహజం గానే మేము స్త్రీలం- ఆయన పురుషుడు - ఆయనకు మేమధీనల మనే భావ మేర్పడుతుంది. ఈ అధీన భావం లోకంలో స్త్రీకి తన పురుషుడి విషయంలో స్వాభావికమే. స్త్రీ శరీర నిర్మాణమే దానికి హేతువు.
Page 166