హరి పూజార్థమని. భగవ దారాధన కోసమే వీరందరి ఆవిర్భావమూ. భగవంతుడికి తాము చేసే దేమీ లేదు. తమ కోసమే తమ ఆత్మోద్ధరణ కోసమే తాము జన్మ ఎత్తారు లోకంలో. దేవతలకు కూడా జన్మ ఉందా అని ఆశ్చర్యపడ నక్కర లేదు. జన్మ రాహిత్య మయ్యే వరకూ ఎవరైనా సరే జన్మించవలసిందే. వారు దేవతలే కాదు. మానవులే కాదు. జన్మ రాహిత్య మెప్పుడవుతుంది. జ్ఞానోదయమైతే. అది ఎప్పుడు. భక్తి యోగం పరిపాకానికి వస్తే. అంటే సగుణం నిర్గుణంగా మారితే. మొదలు సగుణానికే నోచుకో లేదు దేవతలు. కారణ మేమంటే వారు భోగ లాలసులు. కర్మ యోగులై తత్ఫలంగా స్వర్గాది లోకాలు చేజిక్కించు కొన్న వారు కొందరైతే - అసలు జన్మతోనే స్వర్గ వాసులుగా జన్మించిన వారు కొందరు. ఇందులో మొదటి వారు కర్మదేవతలు. రెండవ వారు ఆ జాన దేవతలు. ఆజాన దేవతలూ అనాదిలో ఎప్పుడో ఒకప్పుడుత్తమ కర్మాచరణ మూలంగా అలా అయిన వారే. మొత్తానికి ధర్మానుష్ఠాన పరిపాక ఫలమే దేవతా జన్మ. ఇది కర్మ సమాధి యోగాలు రెంటివల్ల లభించే పదవే గాని భక్తి జ్ఞానాల మూలంగా కాదు. అందుకే ఈ సుర కిన్నర గరుడ గంధర్వ సిద్ధ చారణాది దేవయోను లందరూ చాలా వరకు భోగ దాసులే గాని పరమాత్మ దాసులు కారు. కారు గనుకనే వారికి భక్తి భావాన్ని కరపి బాగు చేయటానికా అన్నట్టు పరమాత్మ అప్పుడప్పుడు వారికి అసుర శక్తుల వల్ల వల్లమాలిన ఉపద్రవాలు కలిగిస్తుంటాడు. దానికి హడలిపోయి వారు కూడా పరమాత్మను శరణువేడి తదను గ్రహంతో ఆ ముప్పు తప్పించుకొని అప్పటి కప్పుడు బ్రతికి బయట పడతారు. అయితే అది సహజం కాదు గనుక పబ్బం గడవ గానే మరలా యథా ప్రకారం గానే భోగ మయమైన జీవితాలు గడుపు తుంటారు. ఇదీ వీరి వరుస.
ఇలాంటి పశుప్రాయమైన జీవితాన్ని తప్పించి వారి కప్పుడప్పుడు తదతీత మైన భగవద్భక్తి నంకురింప జేసి క్రమంగా ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించటానికి
Page 161