#


Index

  పోతే ఇక గోప గోపికల భక్తి. ఇది కూడా సగుణమే. “కామో త్కంఠత గోపికల్" అని ఇది కూడా కామ మనే వ్యాజంతో కూడిందే. అందులో గోపికలది కామమైతే గోపకులది సఖ్యం. దశమ స్కంధమంతా వీరి వ్యవహారం తోనే నిండి నిబిడీ కృత మయి ఉంది. కృష్ణుడు పుట్టింది మధురలోనైనా పెరిగింది వ్రేపల్లెలోనే. బాల్య మంతా అక్కడే గడచి పోయింది పరమాత్మకు. అయినా ఆయనకు బాల్య మేమిటి. పౌగండ మేమిటి - కౌమర మేమిటి వార్ధక్య మేమిటి. అదంతా ఒక నటన. ఒక క్రీడ. తన క్రీడకు మరి కొందరు క్రీడాకారులను తోడుచేసుకోవలసి వచ్చింది. వారేగోపకులు. యాదవు లెవరో చెప్పింది భాగవతం-వారంతా కృష్ణప్రీతితో జననమందిన అమరులే నని.

  యాదవ కులమున సమరులు మేదినిపైఁ బుట్టఁ జనుడు మీ యంశములన్

అని బ్రహ్మ దేవుడు ముందుగానే వారి నాజ్ఞాపిస్తాడు. అంతేగాదు.

  హరి పూజార్థము పుట్టుడు. సుర కన్యలు భూమి యందు సుందర తనులై

  అని దేవతా స్త్రీలను కూడా ఆజ్ఞాపిస్తాడు. వారే గోపికలయి జన్మించారు. అప్సరః స్త్రీలు గోపికలైతే గోపకు లెవరప్పటికి. వారా అప్సరః కాముకులైన గరుడ గంధర్వాది దేవతలే కావాలి. సందేహం లేదు. యాదవులే దేవతలని చెప్పినా-గోపకులు ఫలానా అని చెప్పక పోయినా-ఇది మన మూహించు కోవచ్చు.

  అయితే ఎందుకిలా జన్మించారు వీరంతా. హరి సహాయార్థమా. పరమాత్మకు వీరు చేసే సహాయ మేమిటి. అలా చేసినట్టు ఒక సందర్భం కూడా కనిపించదు వారి జీవితంలో, మీదు మిక్కిలి అడుగడుగునా కృష్ణ భగవానుడే వారి నాదుకో వలసి వచ్చింది. అలాంటప్పు డెందుకు వీరిలా జన్మించటం. ఎందుకో గోపికల విషయంలోనే బయట పెట్టాడు మహర్షి.

Page 160