#


Index

  వాటి కతీతమైన తత్త్వాన్ని అవి ఎలా భావించ గలవు. పట్టుకోగలవు. ఇది ఎలాంటి దంటే ఆకాశంలో ఒక పక్షి ఎగిరి పోతుంటే దాని నీడ క్రింద నేల మీద కనిపిస్తుంది మనకు. ఈ నీడ పక్షి కాదు. అసలు పక్షి నేల మీద లేదు అది" ఎక్కడో దీని కతీతంగా నింగిలో ఎగురుతోంది. దాని నీడ మాత్రమే ఈ నేల పైన కనిపిస్తుంది. దాని లాగా దీనికీ ఒక ఆకార ముంది. దాని లాగానే ఇదీ వేగంగా పోతుంది. అయినా ఇదే వాస్తవమైన పక్షి అనుకొంటే పొరబాటు. వాస్తవమైన దాని ఛాయ-ఆ-భాస- మాత్రమే ఇది. అలాగే వాస్తవ మైన తత్త్వం త్రిగుణాత్మక మైన జగత్తు కతీ తంగా ఉంటే దాని లీల లేదా నీడ మాత్రమే లోకంలో అది ప్రదర్శించే చేష్టలన్నీ. వాటి ద్వారా అసలు దాన్ని పట్టు కోవాలే గాని మానవుడా చేష్టల మేరకే చూచి అవే నిజమని భావించ రాదు.

  అయినా మన మలా భావిస్తున్నా మంటే దానికి కారణం మన మనస్సే. అది నామరూపాలనే వలలో తగులు కొన్న చిలక. దానికి తోడు పోయినదే వచస్సు. మాట. మనస్సును బట్టే వచస్సు. ఒక దానితో ఆలోచిస్తాము. మరొక దానితో ఆవిష్కరిస్తాము. అయితే ఎంత ఆలోచించినా అవిష్కరించినా ఇదంతా మన తార్కిక చాతుర్యం మాత్రమే. ఎంతో గొప్ప గానే ఉండవచ్చు మన హేతువాదం. దాని కెన్నో దృష్టాంతాలు తోడు చేసుకొని చూప వచ్చు. అయినా అది కుతర్కమే గాని సుతర్కం కాదు. కారణమే మంటే నామ రూపాల సరిహద్దులు దాటి పోవటం లేదవి. దేశ కాలాదుల మేర లోకి దించి చూపటానికే ప్రయత్నిస్తుంది. అది శుష్కతర్కం గాక శుద్ధతర్కమెలా అవుతుంది. శుద్ధమైన తర్కమే కావాలంటే మానవుడు తన బుద్ధి బలంతో సాగించేది కావాలి. ఏమిటది. సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ-అయమాత్మా బ్రహ్మ-నేహ నా నాస్తి కించన అనే నిష్పప్రంచ బ్రహ్మాత్మ తత్త్వాని కను గుణంగా సాగే ఆలోచన. అలాటి ఆలోచనా పరుడే ప్రాజ్ఞుడు. మిగతా వారందరూ అజ్ఞులే. అజ్ఞుడంటే అద్వితీయాత్మతత్త్వం తెలియని వాడు.

Page 138