#


Index

  అదేమిటి పరమాత్మ ఈ జీవాత్మ ఎలా అవుతాడని అడిగితే సమాధాన మిస్తున్నా డొకడు అని. ఒకే ఒక చైతన్య మయినప్పుడది ఇక జీవుడేమిటి దేవుడేమిటి. జీవేశ్వరు లనేది మన భ్రాంతి. ఈ భ్రాంతికి మూలం మన దగ్గరే ఉంది. అది మాన ధనం. దేహాత్మాభిమాన మని అర్థం. అది ఒక ధనం లాగా దాచుకొని ఉన్నాము మనం జీవితాంతమూ. అందుకే మనం గోపికలం. అది మనం వదులుకో నంత దనుకా ఆ తత్త్వ మిక్కడే ఉన్నా ఎక్కడో దాగి ఉన్నట్టే మన కదృశ్యం. అది మరలా దృశ్యం కావాలంటే ఈ సృష్టిలో కనిపించే ప్రతి పదార్థాలన్నీ అడుగుతూ పోవాలి మానవుడు. అడిగితే ఈ నామ రూపాత్మక మైన పదార్థాలన్నీ వాడి సృష్టే కాబట్టి ఫలానా అని వాడి స్వరూపాన్ని మనకు మౌన భాషలో సూచిస్తాయి. అయితే ఈ భాషను భేదించి తెలుసుకో గలిగి ఉండా లాతత్త్వ రహస్యాన్ని. లేకుంటే అది అక్కడే ఉన్నా మనకు తెర మరుగే.

  చూడండి. ఎంత గంభీరమైన భావమో. పైకి అధి భౌతికంగా కనిపిస్తున్నా లోపల ఆధ్యాత్మికమైన తత్త్వమెలా ప్రవహిస్తున్నదో. ఇంకా చమత్కార మేమంటే మహాకవి కలం నుంచి ఇలాంటి పద్యమే మరొకటి వెలువడింది. పద జాలంతో సహా ఎత్తుగడతో సహా ఇలాగే నడుస్తుంది చలా వరకది. ఇది కృష్ణ వర్ణన అయితే అది రామ వర్ణన. రామ కృష్ణుల కుండే తేడా తెలిసే లాగా సాగిన వర్ణన అది. నల్లనివాడు పద్మ నయనంబుల వాడు. రాముడూ నల్లని వాడే. పద్మ నయనముల వాడే. నల్లని వాడంటే రూపంలోనే కాదు. గుణంలో కూడా. నల్ల అంటే మంచి అని కూడా అర్థ ముంది. చాలా మంచి గుణాలున్న వాడు. మానవోత్తముడని గదా రాముణ్ణి వర్ణించారు పెద్దలు. పద్మ నయనుడు కూడా ఆయన. పద్మ నయనుడంటే సూర్యుడని కూడా అనుకోవచ్చు. ఉజ్జ్వలమైన సూర్య వంశంలో జన్మించాడు రాముడు. మహా శుగంబులున్ విల్లును దాల్చువాడు. తన అభిజాత్యానికీ తన గుణ గణాలకూ తగినట్టు ధనుర్బాణాలు ధరించాడు.

Page 126