దొంగ మొగం నలుపని కూడా అంటారు లోకులు. కాకపోయినా నల్లని ముసుగు వేసుకొని తిరుగుతాడు గదా దొంగ. రాత్రి అంతా మేలుకొని ఉంటాడు కాబట్టి వాడి నయనాలు పద్మాల లాగాగే ఎఱ్ఱబారి ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఎవరైనా మేలుకొంటే ప్రమాదమని వారు మత్తుగా పడి పోవటానికి ఏదో రస చూర్ణం వారి పైన చల్లటం కూడా సహజమే. అంతే గాక గారడీ వాడి లాగా ఒక నెమలి పింఛం కూడా కళ్ల మీద అటూ ఇటూ తిప్పి కనుకట్టు చేసే దొంగలు కూడా కొందరుంటారు. మరి దొంగఱికం చేసి కూడా ఏమీ చేయనట్టు తెల్లవారి నలుగురిలో నవ్వు మొగం పెట్టి నిర్భయంగా తిరిగినా ఆశ్చర్యం లేదు. లేదా దొంగిలించిన ధనం ఎక్కడో దాచి ఏ పొద మాటున్నో దాక్కొని కూచున్నా కూచోవచ్చు. పైగా ఒకడట వాడు. ఒకడంటే ఎవడో ఒకడు. వాడు ఫలానా అని గుర్తించలేని వ్యక్తి. దొంగ మనకు నేను ఫలానా అని చెప్పి చేస్తాడా దొంగతనం. ఎప్పుడూ వాడు మన కంతు పట్టని వాడే. ఇవన్నీ దొంగ లక్షణాలే. ఒకటి కూడా దొర లక్షణాలు లేవిందులో. అందుకే తమ ధనం యావత్తూ కోల్పోయిన ఆ యువతులు బాధ పడుతున్నారు. మీరైనా చూచి ఉంటే వాడి జాడ తెలిపి మమ్మల్ను కాపాడమని ఓ మల్లియలార అని వాపోతున్నారు.
ఇది గోపికల వాపోవటం కాదు. భగవత్తత్త్వాన్వేషణ పరాయణుడైన ఒక సాధకుడి ఆక్రందన. ఆధ్యాత్మికమైన భావాన్ని అధి భౌతికమైన భూమికలో మరుగు పరచి చెప్పాడు మహాకవి. అది ఛేదించ గలిగితే దొంగ లక్షణాలుగా భాసించే వన్నీ నిజంలో దొర లక్షణాలే ననిపిస్తాయి. కాకపోయినా దొంగ ఎవడో గాదు. కృష్ణుడే గదా. గోపికల దృష్టిలో ఆయన దొరేగాని దొంగ కాదు. కృష్ణుడంటే నల్లని వాడే మరి. నీల మేఘ శ్యాముడు గదా. పద్మ నయనంబుల వాడు. కమలాక్షుడు పుండరీకాక్షు డని గదా ప్రసిద్ధి. మరి శిరసు పైన మయూర పింఛమూ ఆ ముఖంలో మందహాసమూ
Page 124