
ఆలోకనము
సాహిత్య తత్త్వ వరంపరలో మనమింతవరకూ భాగవత సామ్రాజ్యమనే మొదటి భూమికలో యధేచ్చగా విహరించి వచ్చాము. పోతే ప్రస్తుతం మనమిక రామాయణ రామణీయక మనే రెండవ భూమికలో అడుగు పెట్టవలసి ఉంది. అవతార తత్త్వాన్ని వివరిస్తూ రాముడు, కృష్ణుడు ఇవి రెండే విభవావతారాలని వర్ణించి చెప్పాము. అందులో భాగవతమంతా కృష్ణమయమైతే రామాయణం రామమయం. పురాణాలన్నీ మోక్షప్రధానాలని ఇతిహాసాలు ధర్మప్రధానాలని గదా పేర్కొన్నాము. మోక్షమనేది ధర్మంకన్నా ప్రకృష్టమైన పురుషార్ధం కాబట్టి అభ్యర్థితమ్ ప్రధమమనే న్యాయాన్ని అనుసరించి ముందు పురాణ రాజమైన భాగవతాన్ని సమీక్ష చేయవలసి వచ్చింది. తదనుగుణంగా అవతార క్రమంలో వ్యుత్ప్రమం జరిగినప్పటికి కృష్ణ కథా ప్రస్తావనే ముందుగా చేయవలసి వచ్చింది. పోతే కృష్ణావతారమైన తరువాత ఇక శేషించిన విభవావతార మొక్క రామావతారమే కాబట్టి రామకథా సంకీర్తనమే ఇక మనకు కర్తవ్యం.
భాగవతం పురాణమైతే రామాయణ మితిహాసం. పురాణాలంటే చాలా ఉన్నాయి గాని ఇతిహాసాలు మనకున్నవి రెండే. ఒకటి రామాయణం. మరొకటి మహాభారతం. భారతం తరువాతది గనుకనే రామాయణోదంతం భారతంలో కనిపిస్తున్నది మనకు. ఇతిహాసమంటే ఏమిటో చెప్పాము ధర్మపురుషార్ధాన్ని ఎక్కువగా బోధించేదని. సామాన్యులందరికీ కావలసింది పాటించవలసింది ధర్మమే కాబట్టి ఇందులో మానవుడికే ఎక్కువగా ప్రాధాన్యముంటుంది. భగవంతుడికి ప్రవేశంలేదని కాదు. ఉన్నా పురాణంలో మాదిరి బాగా బయటపడి కనిపించడు. నాటకంలో సూత్రధారుడిలాగా చాటు మాటుగా వ్యవహరిస్తుంటాడు. మానవుల మధ్య మెలగుతూ వారి కాదర్శప్రాయుడైన ఒక ఉత్తమ మానవుడిలాగా నటిస్తుంటాడు. ఇలాంటిదీ రామాయణంలో
Page 7
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు