#


Index

రామ యాథాత్మ్యము

పొమ్మన్నా ఇవ్వలేదు. తండ్రి రెండుసార్లు పిలిపించి మాట్లాడుతాడు రాముడితో. పౌరజానపదులంతా అనుమోదించారు నీకు యౌవరాజ్య మప్పగిస్తానని ఒకమారు. పుష్యమీ నక్షత్రం రేపే శుభముహూర్తం అభిషేకిస్తానని మరొక మారు. ప్రకృతులంతా అభినందిస్తున్నారని చెప్పినప్పుడు రాముడు పొంగిపోనూ లేదు. భరతుడు రాకుండానే పట్టాభిషిక్తుణ్ణి చేస్తానంటే అదేమిటినాన్నా భరతుడేమి పాపం చేశాడు అతణ్ణి రానీయండని అభ్యంతరం చెప్పనూలేదు. రెండు మాటలకూ తల ఊపి వెళ్ళిపోతాడు. పైగా తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా రాజుగారు రేపు నాకభిషేకం చేస్తాడట. సీతా నేనూ ఈ రాత్రి ఉపవసించాలట. రేపు గదా అభిషేకం. మరి మాంగళిక విధులన్నీ చేయించమని అంటాడు. ఇది చూస్తే ఎలాగూ జరిగేదికాదు గదా అని నిర్లక్ష్యంగా అన్నట్టు తోస్తుంది దీనికి మెరుగుపెట్టినట్టు లక్ష్మణుణ్ణి చూచి లక్ష్మణేమాం మాయాసార్థమ్ - ప్రశాథిత్వం వసుంధరాం - భుంక్ష్వభోగాం స్త్వమిష్టాన్ రాజ్యఫలానిచ జీవితం చాపి రాజ్యంచ - త్వదర్థమభికామయే - నీవు కూడా నాతో పాటీ రాజ్యభారాన్ని వహించు. రాజ్యభోగాలన్నీ అనుభవించు. నీ కోసమే గదా ఈ రాజ్యాన్ని కోరటం అని అంటాడు. ఎంత హేళనగా ఎంత పట్టీ పట్టనట్టున్న మాటలో చూడండి ఇవి. ఎలాగూ జరిగే వ్యవహారం కాదిది. ముసలాయన పిచ్చేగాని ఈ అభిషేకం జరుగుతుందా పెడుతుందా ? నేనూ అనుభవించను. నీవు అనుభవించవు. చివరకు భరతుడు కూడా అనుభవించేది లేదు. పదునాలుగేండ్లూ ఎవరి ఆలనా పాలనా లేక ఊరక దైవాధీనంగా ఉండబోయేదే సమస్తమూ నని ఇంత భావగాంభీర్యముంది ఈ మాటల్లో.

  తరువాత కైకవల్ల అభిషేకానికి భంగమేర్పడి తన్ను సుమంత్రుడు వచ్చి తండ్రి దగ్గరకు తోడ్కొని పోయేటప్పుడు అన్న మాటలు చూడండి ఇంకా ఎంత భావగర్భితమో నిన్ను మీ తండ్రిగారు చూడాలని కోరుతున్నారు. ప్రస్తుతం వారు కైకేయీ మందిరంలో ఉన్నారని నివేదిస్తాడు సుమంత్రుడు. కైకేయీ మందిరమనగానే గ్రహించాడు రాముడు ప్రస్తుతం పిలవనంపట మిక తన ప్రస్థానానికేనని. ఏవ ముక్తస్తు సంహృష్టో నరసింహో మహాద్యుతిః అని వర్ణిస్తాడక్కడ వాల్మీకి. ఇంతకుముందు రెండుమార్లు పిలిపించినా కలగని ఆనందమిప్పుడు కలిగిందట. అది ముఖంలో కొట్టవచ్చినట్టు ఒక కళా కాంతీ తెచ్చిపెట్టిందట. దానితో నరసింహుడయ్యాడట రాముడు చూడండి.

Page 134

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు