అప్పుడీ కర్మ ఆ ఈశ్వర స్పృహ కడ్డు రాదు. అది మానసిక స్ఫురణ. ఇది భౌతికమైన చర్య. శత్రుత్వం లేదు రెంటికీ. జ్ఞానమే ఈ కర్మలనే ప్రణాళిక ద్వారా బయటపడి ప్రసరిస్తున్నట్లు చూడవచ్చు. జ్ఞానం కనపడదు. అది చేసే కర్మ కనపడుతుంది. కనపడే ఈ కర్మ ఏదో గాదు. దీని వెనకాల ఆ జ్ఞానమే ఉందనే అవగాహన ఉంటే చాలు. ఇది ఎలాంటిదంటే ఒక బల్బు వెలుగుతుంటుంది. ఒక ఫాను తిరుగుతుంటుంది. ఇవి కనపడుతుంటాయి మనకు. కాని వీటికి ప్రేరణ నిచ్చే విద్యుచ్ఛక్తి కనపడదు. పైకి కనపడక పోయినా దాని క్షేత్రంలోనే ఇవి పని చేస్తున్నట్టు - అదే వీటి ద్వారా బయట పడుతున్నట్టు దర్శించటం లేదా మనం. అలాగే ఇదీ.
అలా దర్శించాలంటే ఈ ఆకారాలకూ వ్యాపారాలకూ Forms and Functions వెనకాల ఉన్న ఆ నిరాకారమైన ఆత్మ చైతన్యాన్ని ఒక విద్యుచ్ఛక్తిలాగా అవగాహన చేసుకొనే శక్తి ఉండాలి మానవుడికి. అది కలిగే వరకూ కొంతకాలం ఆ నిర్గుణమైన తత్త్వాన్ని సగుణంగా ధ్యానం చేస్తూ పోవాలి. దీనికే ఉపాసన అని Meditation పేరు. అలా చేస్తూ పోతే మనసు బాగా నిర్మలమూ ఏకాగ్రమూ అవుతుంది.
Page 8