#


Back

Page 2

పూర్ణానుభవము

అన్వేష్టవ్యాత్మ విఙ్ఞానాత్ ప్రాక్ప్రమాతృత్వ మాత్మనః |

అన్విష్టః స్యాత్ప్రమాతైవ పాప్మదోషాది వర్జితః ||

దీనితో ప్రమాత శుద్ధి అయింది. ఇక ప్రమేయ శుద్ధి కావలసి ఉంది. ప్రమేయమనేది లేదు వాస్తవంలో. ఙ్ఞానానికి గోచరించేదే కదా ప్రమేయమంటే. అంతా ఙ్ఞాన స్వరూపమే. అది మన ఆత్మే అన్నప్పుడిక ప్రమేయమెక్కడిది. అయినా చిత్రమేమంటే ఒక ప్రమేయమనేది ఉన్నట్టు చూస్తున్నాము. అంటే ఏమన్నమాట. ఆత్మే తన్ను తాను రెండుగా మార్చుకొని చూస్తున్నది. అందులో చూచే ఆత్మ ప్రమాత అయితే చూడబడే ఆత్మను ప్రమేయమంటున్నాము మనం. అదీ వస్తుతః ఆత్మే. కాని మన అఙ్ఞానవసాత్తూ అది ఏదో దానికి బాహ్యమైన విషయంగా భావించాము. అలా భావించేసరికి దాన్ని అన్వేషించి పట్టుకోవాలనే ప్రయత్నమేర్పడింది. ఇదే అన్వేష్టవ్యాత్మ అంటే. అన్వేషణ సాగించినంతకాలమూ అది మనకు ప్రమేయంగానే గోచరిస్తుంది. విఙ్ఞానాత్ప్రాక్ప్రమాతృత్వ మాత్మనః అది ఫలానా అని దాని నిజ స్వరూపాన్ని గుర్తించనంత వరకూ మనం దానిని ప్రమాత అనే భావిస్తుంటాము. అప్పుడా ప్రమేయం మన పాలిటికొక జగత్తుగానూ ఈశ్వరుడుగానూ దర్శనమిస్తుంది. దాని నన్వేషించే ఈ ప్రమాత జీవుడుగా స్ఫురిస్తాడు.

ఇదంతా ఆత్మకోస మన్వేషణ చేస్తున్నంతవరకే. అన్వేషణ పూర్తి అయ్యేసరికిందులో ఏదీ ఉండదు. ఈశ్వరుడూ లేడు. జగత్తూ లేదు. మనమనుకొనే జీవుడూ లేడు. అప్పుడీ ప్రమేయంగా చూచేదంతా ఎగిరిపోయి ప్రమాత ఒక్కడే మిగిలిపోతాడు. అన్విష్టః స్యాత్ప్రమాతైవ. ప్రమేయాన్ని పట్టుకోబోయి ప్రమాత చివరకు తన్ను తానే పట్టుకొన్నవాడవుతాడు. ఇది ఎలాంటిదంటే ఒక పిల్లికూన ఓరగంట చూస్తూ ఉంటే దానిప్రక్కనే ఒక పొడుగాటి వస్తువు కనపడిందట. అది ఏదో పట్టుకోవాలని అటు తిరిగితే అది ఇటు తిరిగిందట. తీరా అది ఏమిటా అని చూస్తే ఏదో గాదు దాని తోకే. ఇక పట్టుకొనేదేముంది. పట్టుపడే ఉందది. అలాగే ఇక్కడా మన మన్వేషిస్తున్నది మన స్వరూపమే. స్వరూపమేనని గుర్తించినప్పుడిక ప్రయత్నమేముంది. ప్రమేయము లేనప్పుడు ప్రమాతా లేడు. ప్రమేయాన్ని బట్టి కదా ప్రమాత. అది లేకుంటే ఇదీలేదు. రెంటికీ బదులున్నది నేనే. నా చైతన్యమే.

దీనికి మరొక మంచి దృష్టాంతం మన స్వప్నం. రాత్రి పడుకొని నిద్రిస్తుంటే మనకొక స్వప్నం వస్తుంది. అందులో ఎన్నో దృశ్యాలు కనిపిస్తుంటాయి. అవన్నీ మనకు భిన్నంగానే కనిపిస్తాయి. అంతేకాదు. అందులో మన శరీరమూ మనకు వేరుగానే గోచరిస్తుంది. కాని తెల్లవారి మేలుకొనేసరికందులో ఏదీలేదు. ఆ జగత్తూ లేదా జీవుడూ లేడు. ఏమయ్యారు. అసలుంటే కదా ఏమో అవటానికి. నేనే ఆయా రూపాలలో భాసించి మరలా నేను నేనుగానే మిగిలిపోయాను. నిజంగా నేను రెండయ్యానా. కాలేదు వాస్తవానికి. అయినట్టు నాకు తోచింది. ఆ తోచటం నా అఙ్ఞానం వల్లనే. ఙ్ఞానోదయమయ్యేసరి కఙ్ఞానం తొలగిపోయింది. దానితోపాటు తజ్జన్యమైన స్వప్న జగత్తూ పోయింది. స్వప్న గత జీవుడూ పోయాడు. రెండూ పోయి రెండింటి స్థానంలో సాక్షిగా నేనే శేషించాను.

అలాగే ప్రస్తుత మీ జీవజగద్రూపంగా భాసమానమయ్యే ప్రమేయమంతా వాస్తవానికి నేనే. నా ఙ్ఞానమే. నా ఙ్ఞానమేనని గుర్తించక అనాద్యవిద్యా వాసనతో ఎవరికి వాళ్లం మనమొక పగటి కలకంటున్నాము. ఎన్ని జన్మలనుంచి కంటున్నామో మనకే తెలియదు. దీని మూలంగా అఖండమైన స్వరూపం మనకవగతం కాకుండా పోయింది. మరో రూపంలో ప్రత్యక్షమై అదే మనలను తికమక పెడుతున్నది. అదేదో మనకు భిన్నమైన పదార్థం దాన్ని పట్టుకోవాలనే ప్రయత్నానికి దారితీసింది. దానికోసం జీవితాంతమూ ప్రాకులాట సాగిస్తున్నాము. ఎంత సాగించినా అది రోదసీ రేఖలాగా మనకందటం లేదు. అందటానికది మనకు బాహ్యమైన పదార్థమైతే గదా. అది గుర్తించకనే ఈ ప్రాకులాట. గుర్తిస్తే ఏదీలేదు. కంఠచామీకర న్యాయమే.

అయితే ఒక సందేహం. గుర్తించకముందు నేనే. గుర్తించిన వెనుకా నేనే గదా. అలాంటప్పుడీగుర్తించటం మూలంగా క్రొత్తగా కలిగే ప్రయోజనమేమిటి. వాస్తవమే. క్రొత్తగా వచ్చిపడేదేమీ లేదు. కాని ప్రయోజనం కాని ప్రయోజనమొకటుంది ఈ అన్వేషణ వల్ల. అదే పాప్మదోషాది వర్జితః మూడు విధాలైన పాపాలు పట్టి పీడిస్తూ వచ్చాయంతకు ముందు. ఒకటి అవిద్య. రెండవది కామం. మూడవది కర్మ. నా అఖండ తత్వాన్ని గ్రహించకపోవట మవిద్య. అది ఖండమై కనిపిస్తే దాన్ని పొందాలని అభిలషించటం కామం. పొందటానికి చేసే ప్రయత్నం కర్మ. ఇవి మూడూ ఒకదానికొకటి కారణమై అన్నీ కలిసి చివరకు మనలనీ సంసార సాగరంలో పడద్రోశాయి. దీన్ని తప్పించుకోవాలంటే అన్నింటికీ మూలకారణమైన అవిద్యను ముందు నిర్మూలించాలి. దాన్ని నిర్మూలిస్తే చాలు. మిగతాదంతా నిర్మూలమై పోతుంది. అవిద్యకి విరుగుడు విద్యే. అంటే అఖండమైన ఙ్ఞానమే. ఈ విచారణ చేయకముందది అవిద్యాదులవల్ల మనకు పరోక్షంగా ఉండి పోయి అనుభవానికి రాలేదు. ఇప్పుడా విచారణ పూర్తి అయ్యేసరికదే అపరోక్షమై అనుభవానికి వచ్చింది. ఇదే ఇక్కడ మనం చెప్పుకోదగిన ప్రయోజనం.

దేహాత్మ ప్రత్యయో యద్వత్ప్రమాణత్వేన కల్పితః |

లౌకిక స్తద్వదే వేదం ప్రమాణం త్వాత్మ నిశ్చయాత్ ||

దీనితో ప్రమేయం కూడా పరిశుద్ధమయి ప్రమాతృ ప్రమేయాలు రెండూ అఖండమైన ఆత్మ చైతన్యంగానే దర్శనమిచ్చాయి. ఇచ్చాయంటే అది మాటలో గాదు. అనుభవానికి రావాలి. అనుభవానికి వచ్చినప్పుడే పరిపూర్ణత. అలాటి పూర్ణానుభవమెలా కలుగుతుంది. ఏ అనుభవమైనా కలగాలంటే దానికొక ప్రమాణమనేది ఉండి తీరాలి. ప్రమాణమంటే ఙ్ఞానసాధనమని పేర్కొన్నాము. అది బాహ్యజగత్తుకు సంబంధించి ప్రత్యక్షమైతే, భావ జగత్తుకు సంబంధించి అనుమానం. ఏ ఙ్ఞానం కలిగినా మనకీ రెంటి మూలాన్నే కలుగుతున్నది.

పోతే ఈ రెండూ పనికి రావిప్పుడు మన ఆత్మ ఙ్ఞానానికి. అది ఈ రెంటికీ అతీతం. ఏమి కారణం. అది వస్తువూ కాదు. భావమూ కాదు. రెండింటినీ గమనిస్తున్న ఙ్ఞానం. ఙ్ఞానమే దాని స్వరూపం. ఙ్ఞేయం కాదది. అలాంటప్పుడీ ప్రత్యక్షానుమానాలు దాన్ని ఎలా పట్టుకోగలవు. ఇవి కేవలం లౌకికమైన ప్రమేయాలను చూపే లౌకిక ప్రమాణాలు. దేహాత్మ ప్రత్యయో యద్వత్ప్రమాణత్వేన కల్పితః లౌకికః దేహమే నేననే ప్రమాతృ భావమున్నప్పుడే ఇవి పనిచేసేది. అంతేకాదు. ప్రత్యక్షమైనా అనుమానమైనా మనసులో కలిగే ఒకానొక వృత్తి అది. నామరూపాలకు సంబంధించినదే గనుక ప్రతివృత్తీ నామరూపాత్మకమే. కాగా ఆత్మ అనేది ఇలా నామరూపాత్మకమైనది కాదు. అది నిరాకారం. ఏకం. వ్యాపకం. అలాటి తత్వాన్ని పట్టుకోవాలంటే మామూలు వృత్తులేవీ పనికిరావు. నిరాకారమూ, ఏకమూ, వ్యాపకమూ అయిన వృత్తే కావాలి. ప్రత్యక్షానుమానాల కలాటి యోగ్యతలేదు.

మరి అలాటి వృత్తి మనకెలా కలుగుతుంది. ఏది సరఫరా చేయాలి దాన్ని మనకు. దానికే శాస్త్రమని పేరు. శాస్త్రం బోధించే తత్త్వమస్యాది మహావాక్యాల తాత్పర్యాన్ని బాగా మననం చేస్తే అలాటి ఆత్మాకార వృత్తి ఉదయిస్తుంది. మానవుడి మనస్సుకొక అద్భుతమైన శక్తి ఉంది. రెండందాల పదునైన కత్తి అది. సవికల్పంగానూ చూడగలదది, నిర్వికల్పంగానూ చూడగలదు. సాకారాన్నీ గ్రహించగలదది. నిరాకారాన్నీ గ్రహించగలదు. పృథివ్యాదులైన స్థూలపదార్థాలను చూచినట్టే సూక్ష్మమైన వాయ్వాకాశాలను కూడా మనం గ్రహిస్తున్నాము గదా. అలాగే బాహ్యమైన గృహారామాది ఆకారాలను దర్శించినట్టే నిరాకారమైన సుఖదుఃఖాది భావాలను భావిస్తున్నాము గదా. ఇంత విశిష్టమైన సామర్థ్యముండటం వల్లనే మనస్సు సచ్చిద్రూపమైన ఆత్మను కూడా భావించగలదు. శాస్త్ర జన్యమైన ఈ భావనే ఇక్కడ ప్రమాణం. తద్వదేవేదం ప్రమాణం. సవికల్ప జగత్తుకు సవికల్ప వృత్తులెలాగో నిర్వికల్పమైన ఆత్మను గ్రహించటానికి నిర్వికల్పమైన ఈ వృత్తి ఒక్కటే ప్రమాణం.

అయితే ఒక్క మాట. ఆ ఆత్మ నిశ్చయాత్తన్నారు శాస్త్రఙ్ఞులు. ఆత్మను పట్టుకొనేంత వరకే ఇదైనా మనకు ప్రమాణం. పట్టుకున్న మరుక్షణమిది మాయమై పోతుంది. మాయమై ఎక్కడికి పోతుంది. ఆత్మ చైతన్యంలోనికే. ఎందుకంటే ఆత్మ అనేది అద్వితీయమని వర్ణించాము. దానికి విలక్షణంగా ఏ ఒక్కటీ ఉండటానికి లేదు. ప్రమాతృ ప్రమేయాలే లేనప్పుడీ ప్రమాణం మాత్రమెలా ఉండగలదు. అది అద్వితీయమైనా మన అఙ్ఞానవశాత్తూ సద్వితీయంగా భాసిస్తున్నది గనుక ఆభాసను రద్దు చేస్తూ మరలా దాని అద్వితీయత్వాన్ని ఙ్ఞాపకం చేయటానికే ఇది తాత్కాలికంగా మనకు ప్రమాణమవుతున్నది. ఙ్ఞాపకం చేసిన వెంటనే అఖండమైన ఆత్మతత్వం అనుభవానికి వస్తుంది. కాబట్టి అప్పుడది మనకక్కరలేదు. ఇంకా నిలిచి ఉందంటే అద్వితీయం మరలా సద్వితీయమై కూచుంటుంది. అది మొదలు చెడ్డబేరం. ఇదీ లౌకిక ప్రమాణాలకూ శాస్త్రప్రమాణానికీ ఉన్న తేడా. అవి విషయాన్ని ఙ్ఞప్తికి తెచ్చి కూడా అంతరించవు. ఇది ఙ్ఞప్తికి తెచ్చిన తక్షణం అంతరిస్తుంది.

ఏతావతా ఈ విచారణవల్ల మనకు తేలిన సారాంశమేమిటి. ప్రమాత ప్రమేయం ప్రమాణమని పేరేగాని అసలీ ముడూ లేవు. ఉన్నదొకే ఒక ఆత్మతత్వం. అఖండమది. దానిలో ప్రమాత్రాది విభాగానికి చోటులేదు. స్వతస్సిద్ధమది. దాని ఉనికినే ప్రమాణమూ సాధించనక్కరలేదు. అది మనకు పరోక్షంకూడా కాదు. మన స్వరూపమే. స్వరూపమై కూడా అది మన అనుభవానికి రాలేదంటే ఆశ్చర్యం. అందుకేదో ప్రబలమైన కారణమే ఉండాలి. అది ఏదో కాదు. అనాది కాల ప్రవృత్తమైన మన అఙ్ఞానమే. అది అఖండమూ కేవల ఙ్ఞానస్వరూపమూ అని తెలియకపోవటమే అఙ్ఞానం. ఙ్ఞానమే అయినప్పుడెలా తెలియకపోయింది. తెలిస్తే ఈ ప్రమాత్రాది విభాగం కనపడేది కాదుగదా. కనపడుతున్నది గనుకనే అఙ్ఞానమనేది ఒకటి అడ్డు తగులుతున్నదని చెప్పవలసి వచ్చింది. "నహి దృష్టే అనుపపన్నం నామ" అన్నారు శాస్త్రఙ్ఞులు. ఒకటి మనకు దృష్టమవుతున్నప్పుడిది ఎందుకు ఎక్కడిదనే ప్రశ్నలేదు. దృష్టమవుతున్నప్పుడీ ప్రపంచం. అఙ్ఞానం లేకుంటే ఇది ఇలా దృష్టం కాదు. కనుక అఙ్ఞానమే మనకున్న సమస్య. సమస్యకు పరిష్కారమాలోచించటం మన కర్తవ్యం. అఙ్ఞానానికేమిటి పరిష్కారం. ఙ్ఞానమే. ఙ్ఞానమంటే మన స్వరూపాన్ని మరలా మనం గుర్తుచేసుకోవటమే.

దీనికే ప్రత్యభిఙ్ఞ అని పేరు. మరచిపోయినదాన్ని ఙ్ఞప్తికి తెచ్చుకోవటమే ప్రత్యభిఙ్ఞ. ప్రతి రాత్రీ మనం చూచే స్వప్నమే మనకు మంచి ఉదాహరణ. స్వప్నంలో మనలను మనం మరచిపోయి మరి ఒక ప్రపంచాన్ని చుస్తుంటాము. మన స్థానంలో మరొక వ్యక్తిని కూడా చుస్తుంటాము. వారి పరస్పర వ్యవహారాన్ని కూడా గమనిస్తుంటాము. అలా గమనిస్తున్నదింతకూ ఎవరంటావు. అది వాస్తవంలో ఆ స్వప్న దృశ్యమూ కాదు. స్వప్నద్రష్టా కాడు. వాడి తాలూకు ఇంద్రియ వర్గమూ కాదు. మరెవరు. ఆ మూడింటినీ సాక్షిగా చూస్తూ మంచం మీద పడుకొని ఉన్న మనమే మన ఙ్ఞానమే. మెలుకువ రాగానే అవి మూడూ తొలగిపోయి మన ఙ్ఞానం నిలిచి ఉండటమే దీనికి నిదర్శనం. అప్పుడా స్వప్నమనే ప్రమేయమూ, దానితో వ్యవహరించిన ప్రమాతా- అతడి తాలూకు చక్షురాది ప్రమాణాలూ ఒక్కటీ కానరాదు. మూడూ కలిసి మన ఙ్ఞానంలోనే విలీనమై పోయాయి.

అలాగే ప్రస్తుతమీ జాగ్రద్దశలో కూడా నేను నేనని భావించే ఈ ప్రమాతా- ఈ ప్రమాతకి గోచరించే నామరూపాది ప్రపంచమూ- దాన్ని గ్రహించటానికి తోడ్పడే ఇంద్రియ కలాపమూ - ఈ ప్రమాతృ ప్రమేయ ప్రమాణాలు మూడే - స్వప్న దశలోలాగా అంతా హుళక్కే. అక్కడ మన ఆత్మ మరుగునపడి వాటినెలా కనిపెట్టి చూస్తున్నదో - ఇక్కడా అలాగే చూస్తున్నది. అక్కడ మెలుకువ వస్తే ప్రమాత్రాదులు మూడూ కరగిపోయి మన స్వరూపం మాత్రమే ఎలా మిగిలి పోతుందో ఇక్కడా అంతే. అయితే ఎంతవరకంటే స్వప్నం నుంచి మెలుకువ అప్రయత్నంగా వస్తుంది. అప్రయత్నంగానే తొలగిపోతుంది. కాని జీవితంలో మాత్రం మనం దాన్ని ప్రయత్నంతో సాధించవలసి ఉంది. అలాగైతేనే తొలగకుండా మనకది శాశ్వతంగా దక్కుతుంది. ఆ ప్రయత్నం అఖండాత్మ భావనారూపమైన ఙ్ఞానమైతే - ఆ కలిగే మహాఫలమేదో గాదు మోక్షం. సంసారమనేది అఙ్ఞాన జన్యమైతే మోక్షం ఙ్ఞానైక సాధ్యం. అఙ్ఞానంవల్ల అఖండమైన ఆత్మచైతన్యం ప్రమాత ప్రమేయం ప్రమాణమని మూడు ఖండాలయి మనలనీ సంసారంలో కట్టిపడేస్తే ఙ్ఞానంవల్ల మరలా అవి మూడూ ఏకమై అఖండ రూపంగా భాసించి మనకు ముక్తిని ప్రసాదిస్తుంది. మొత్తానికీ మూడు గాథల మూలంగా మనకు బోధపడే జీవిత ప్రమార్థమిదే. ఒక్కమాటలో పరిపూర్ణాత్మానుభవం.

***

End