రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఇలాటి ప్రత్యభిజ్ఞాన మాంధర్యమీ రాజుకే కాదు. మిగతా ఇద్దరు రాజులకు కూడా ఇదే జబ్బు. ముగ్గురూ నవ యువకు లేమీ గాదు. వయసు మళ్ళిన వారే. బాగా వయసు మళ్ళిన వారినే ఎన్నుకొన్నాడు మహాకవి తన కథా నాయకులుగా. మరి మతిమరుపు లేక ఎలా పోతుంది. బుద్ధి నవనవోన్మేషంగా ఎలా పని చేస్తుంది. అలా పని చేస్తూ వచ్చింది వారికి గాదు. వారి నాయికలకు. వారు మువ్వురూ మంచి జవ్వనంలో ఉన్న నాయికలు. మాళవికేమి- ఊర్వశి ఏమి- శకుంతలేమి. ముగ్గురూ తరుణులే. శృంగార నాయికలు ముగ్గురికీ ముగ్గురూ ప్రతీకలే. ఒకతి ముగ్ధ. ఒకతి మధ్య. ఒకతి ప్రౌఢ. శకుంతలలో ముగ్ధను చూచాడు కాళిదాసు. మాళవికలో మధ్యను చూచాడు. పోతే ఊర్వశిలో బాగా ప్రౌఢను దర్శించాడు. విత్తేశానాం నచ ఖలు వయో యౌవనా దన్య దస్తి అని మేఘసందేశంలో తానే వర్ణించినట్టుగా ఊర్వశి సాక్షాత్తూ అప్సరసే కాబట్టి నిత్య యౌవన. మిగతా ఇద్దరూ తరువాత పరిణత లైనా అప్పటికి యువతులే. అప్సరసల లాంటి వారే. శకుంతల అప్సరస్సంభవే గదా. మాళవిక. అప్సరస్సంభవ కాకున్నా అగ్నిమిత్రుడి కంటికి- కాదు కాదు- కాళిదాసు కంటి కప్సరసే. ఊర్వశి నింగి నుంచి నేలకు దిగిన అప్సర అయితే- శకుంతల నేలమీది నుంచి నింగి కెగసిన అప్సరస. పోతే నేల మీదనే ఎక్కడి నుంచో ప్రచ్ఛన్నంగా పయనించి ఎక్కడో దర్శన మిచ్చిన అప్సరస మాళవిక. అందరూ అప్సరసలే కవి దృష్టి కందరూ నవ యౌవనలే. ఇందులోనూ- ఈ నాయికా నాయక సృష్టిలోనూ- శివ శక్తి తత్త్వ రహస్యమే కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది మన మనోనేత్రానికి. కాళిదాసు దృష్టిలో నాయకు లందరూ శివ ప్రతీకలూ- నాయిక లందరూ శక్తి ప్రతీకలేనని కదా సూచించాము. శివుడు పురాణ పురుషుడు. ఆయన వయస్సింత అని చెప్పలేము. అనాది నిధనుడైన వాడి వయసుకు కొలత ఏముంది. ఎంతైనా వృద్ధుడాయన. కనుకనే నాయకులంతా వృద్ధులయి కూచున్నారు నాటకాలలో. పోతే ఆ శివతత్త్వాన్ని ఆశ్రయించిన పరా శక్తి మాత్ర మలాంటిది కాదు. ఆవిడా ఆయన లాగా పురాతనే అయినా కామరూపిణి. నామ రూప క్రియాత్మకంగా ఎలాగంటే అలా పరిణమించ గలదు. ఎంత
Page 95