#


Index

స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

దండెత్తి వచ్చాడు సముద్ర గుప్తుడు. ఆంధ్ర ద్రవిడ కేరళాది రాష్ట్రాలన్నీ జయించి ఆయా రాజులను పాదాక్రాంతులను చేసికొని తన పరాక్రమానికి చిహ్నంగా విక్రమాదిత్య విక్రమార్క అనే బిరుదులు కూడా ధరించి నట్టుంది చరిత్రలో. సరిగా కాళిదాసు రఘు మహారాజు దండ యాత్ర నిలాగే వర్ణించాడు. రఘువు దక్షిణ భారతానికి వచ్చి ఇక్కడ ఉన్న రాజు లందరినీ ఓడించటం సముద్ర గుప్తుడు చేసిన పనికి సూచకమే. అంతేగాక విక్రమాదిత్య అనే ఆయన బిరుదు కూడా విడిచి పెట్టక దానిని పురూరవుడికి తగిలించి అతడు కథా నాయకుడుగా విక్రమోర్వశీయ మనే నాటకం కూడా రచించాడు. ఇది ఇంకా బలపరుస్తున్నది కాళిదాసు గుప్తుల కాలంలో జీవించిన వాడని వారి ఆస్థాన కవేనని చెప్పటాన్ని.

  ఇంతకూ ఆయన దేశకాలాలను గూర్చి ఇంతకన్నా మనకు చర్చ అక్కర లేదు. ఇదయినా ఎందుకంటే దేశకాలాల ప్రభావం కొంత వరకు పనిచేస్తుంది కవి మనసు మీద. అవి అతనికి నిసర్గ సిద్ధంగా ఉన్న భావాలను వెలికి తీసి వాటికి మెరుగు పెడతాయి. దీనికే సంస్కార మని పేరు. నిసర్గ సంస్కార వినీత బుద్ధిః అని ఆయనే వర్ణించా డొకచోట. నిసర్గానికి సంస్కార మనేది తోడు కావాలట. అప్పుడే పరిపూర్ణత ఒక మానవుడికి. ముఖ్యంగా కళాకారుడికి. నిసర్గాన్నే ప్రతిభ అని శక్తి అని వ్యవహరిస్తారు. సంస్కారాన్నే వ్యుత్పత్తి అని పేర్కొంటారు ఆలంకారికులు. వ్యుత్పత్తినే నిపుణత అన్నాడు మమ్మటుడు. ఇది లోక శాస్త్ర కావ్యాద్య వేక్షణాత్. లోకంతో అతనికుండే సంబంధం వల్ల - శాస్త్ర కావ్యాది పరిచయం వల్ల ఏర్పడుతుందట. లోక మంటే అతడు జీవించిన దేశ కాలాది వాతావరణం. ఇంతకు ముందే చెప్పాము కాళిదాసు గుప్తుల కాలం వాడని. ఆ కాలంలో ఈ దేశమూ ఈ ప్రజా జీవితమూ ఎలా ఉండేది. స్వర్ణ యుగమని గదా వర్ణించాము. స్వర్ణ యుగ మన్నప్పుడది ఎలా ఉంటుందో మన మూహించుకోవచ్చు. రాజులు సర్వ సమర్థులు

Page 6

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు