రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
మిప్పుడు నిరూపించ వలసి ఉంది. కథా పాత్ర రస భావాలే గదా రచనా సామగ్రి అని పేర్కొన్నాము. ఈ సామగ్రి ఎలాంటిదయి ఉండాలని చెబుతున్నాడో విందాము కాళిదాసు. ప్రణయిషు వా దాక్షిణ్యాత్ అధవా సద్వస్తు పురుష బహుమానాత్ . ఇది విక్రమోర్వశీయారంభంలో ఆయన సెలవిచ్చిన రచనా సూత్రం. నీవే రచన చేసినా అందులో వస్తువు గాని పాత్రలు గాని సద్వస్తువు సత్పాత్రలయి ఉండాలట. సద్వస్తు వేది ఈ సృష్టిలో. శివ శక్తి తత్త్వాలు రెండే. అవి మరలా రెండు గావు ఒకటే. అదే శివ శక్తి సామరస్య మంటే. దీనిని గుర్తించటమే ప్రత్యభిజ్ఞ. అది మన అవిద్యా దోషం వల్ల కప్పబడింది. తామసీ వృత్తి అని కవి మాళవికాగ్ని మిత్రంలో వర్ణించిందదే. ఆ వృత్తి నివృత్తి అయితే గాని సన్మార్గాలోకానికి నోచుకో లేడీ మానవుడు. నివృత్తి కావాలంటే నేనా ఈశ్వరుడననే ప్రత్యభిజ్ఞా ఏర్పడాలి. ఈశ్వర వివర్తమే జీవుడు. శక్తి వివర్తమే జగత్తు. వివర్త రూపంగా ఇవి తత్త్వానికి దూరం చేసి బాధిస్తున్నాయి మనలను. మరలా నేనీశ్వరుడనే అనే ప్రత్యభిజ్ఞ ఎప్పు డుదయించిందో ఆ బలంతో జీవు డీశ్వరు డయ్యాడు. కాగానే జగత్తు శక్తి రూపంగా అతణ్ణి ఆశ్రయిస్తుంది. ఇదే నిశ్రేయసం మానవుడికి. ఇందులో శివశక్తి భిన్నంగా చూస్తే సమస్తమూ అసత్తే. తదభిన్నంగా చూస్తే తనతో సహా సకలమూ సత్తే.
ఈ సద్రూపంగా జగత్తునే కాదు. తత్ప్రతిరూపమైన కావ్య జగత్తును కూడా చూడమంటున్నాడు కాళిదాసు. జగత్తులో మనమూ మన జీవితమూ ఎలా శివశక్త్య భిన్నంగా సత్తో అలాగే కావ్య జగత్తులో కూడా నేను సృష్టించిన కధా వస్తువు పాత్ర వర్గమూ కూడా ఆ అభేద భావనను చాటటానికే సృష్టించాను సుమా. కనుక శృణుత జన అవధానాత్. నా ఈ రచనలను మీరు సావధానంగా దృష్టి పెట్టి చూడాలి. లేకుంటే కవి హృదయం మీ కంతు పట్టదు. ఇవేవో మిగతా కథల లాంటివే మిగతా కవులు సృష్టించిన పాత్రల లాంటివేనని బోల్తా పడతారు. నా పాత్ర లందరూ ప్రణయులు. ప్రణయిషు వాదాక్షిణ్యాత్. వారు ప్రణయులనే దాక్షిణ్యంతో నైనా పరిశీలించండి నా రచనలు మీరు అని
Page 59