స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఇది కాళిదాసే భంగ్యతరంగా బయటపెడతా డక్కడక్కడా పాత్రల మీద నెపం పెట్టి. మాళవికాగ్నిమిత్రంలో గణ దాసనే నాట్యాచార్యుడు తన శిష్యురాలు మాళవిక నైపుణ్యాన్ని మెచ్చుకొంటూ అంటాడు. యద్యత్ ప్రయోగ విషయే భావిక ముపదిశ్యతే మయా తస్యై - తత్తద్విశేష కరణాత్ ప్రత్యుప దిశతీవ మే బాలా. ఏయే అభినయం నేను నేర్పితే దాన్ని ఇంకా విశేషంగా అభినయించి నాకే ఆవిడ మరలా పాఠం చెబుతున్న దంటాడు. అలాగే మరొక చోట పాత్ర విశేషే న్యస్తం గుణాంతరం ప్రజతి శిల్ప మాధాతుః తగిన వ్యక్తికి నేర్పిన కళ ఎప్పటికీ వమ్ముగాదు. వమ్ము కాక పోవటమే గాక ఇతోధికంగా ప్రకాశిస్తుంది. వర్ష బిందువు ముత్యపు చిప్పలో పడి అది ముక్తా ఫలమై ప్రకాశించటం లేదా అంటాడు. ఇవి సరిగా కాళిదాసు రచనా విషయంలో మనం చెప్పుకోవలసిన మాటలు. మామూలు జలకణాలు శుక్తిలో పడి విలువైన ముత్యాలుగా మారినట్టు పురాణేతిహాసాల లోని కథా వస్తువే భావాలే కాళిదాసు భావనా శుక్తికలో చేరి అమూల్యమైన కావ్య మౌక్తికాలుగా భాసించాయి. వాల్మీకి వాల్మీకే. కాళిదాసు కాళిదాసే. ఆ మహర్షి కెంత అప్పుపడినా బ్రహ్మాండంగా గడించిన సంపదతో దానినెప్పుడో ఆయనకు తీర్చివేశాడు కాళిదాసు. ఆయన మార్గాన్ని ఎంత అనుసరించినా ఆ వాసన రానీయడు జాడ కనపడ నీయడు మనకు. పదం మొదలు ప్రబంధం వరకూ తనదైన ముద్ర ఒకటి వేసి కాళిదాసు కాళిదాసే అనిపించుకొంటాడు. నా యీ ధోరణి అచ్చమైన కావ్యధోరణి ఇలాంటిది పురాణేతిహాసాలలో నీకెక్కడ కనపడుతుంది. వేదాభ్యాస జడ: కథంను విషయ వ్యావృత్త కౌతూహలః- విజ్ఞానానికి తప్ప సౌందర్యాని కంత ప్రాధాన్య మివ్వరు వారు. అదీ పునః పునః బోధ చేసి మనకు బాధ కలిగిస్తారు. పైగా విషయ ప్రతిపాదనలో కౌతూహలాన్ని పెంచే దృష్టి లేదు వారికి, అలాటి పురాణ రచయిత లెంత మహర్షలయినా కథం నిర్మాతుం ప్రభవే న్మనోహర మిదం రూపం. ఇలాటి రసిక జన మనోహర మైన కావ్య సుందరిని ఎలా తీర్చి దిద్దగలరని ధ్వని గర్భితంగా కూడ తన అభిప్రాయాన్ని అవిష్కరిస్తాడు.
Page 49