స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
అచేతన వ్యవహారం - అచేతన వర్ణనలో చేతన వ్యవహారం పట్టుకు రావట మొక అందం. ఇలాటి అంద చందాలు కూడా వాల్మీకి నేర్పిన పాఠాలే కాళిదాసుకు.
ఇక పాత్రల మనోభావాలు బయట పెట్టటంలో ఎన్ని మెళకువ లున్నవో లోతుకు దిగి చూచి చెప్పే శక్తి కూడా మహర్షి ప్రసాదమే. ఆయన రచన ఆయన సమాస గుంభన పద ప్రయోగం వాక్య ప్రయోగం ఒకటేమిటి. ప్రతి ఒక్కటీ బీరు పోకుండా అనుకరిస్తాడు కాళిదాసు. స్నిగ్ధ గంభీర నిర్దోష మంటే స్నిగ్ధ గంభీర నిర్దోష మనే అంటాడు. జరా జర్జరిత మంటే జరా జర్జిరితమే నంటాడు. శీర్ణ కేసర మంటే శీర్ణ కేసర మంటాడు. సుఖ స్పర్శమంటే సుఖ స్పర్శ మంటాడు. పశ్యన్ యయౌ అంటే పశ్యన్ యయౌ అనే అంటాడు. ఎక్కడ ఏ పదం వాడాలో ఏ సమాస మెంత వరకు లాగాలో ఏ వాక్య మెక్కడికి తేవాలో ఏ వృత్త మెంత నిసర్గ సుందరంగా నడపాలో ఎక్కడ అవరోహణారోహణాత్మకంగా సాగాలో ఎక్కడ ఉల్బణంగా ఎక్కడ సౌమ్యంగా పయనించాలో అన్ని రచనా రహస్యాలూ గురువుగా రెలా పలికితే అలా పలికాడు శిష్యుడు. అన్నిటి కన్నా గొప్పదా గురువు గారి అక్షర శిల్పం. అది వాల్మీకి ఎంత కూడ బెడితే అంత కొల్లగొట్టాడీ గడుసరి శిష్యుడు. 'ఒక స్త్రీ కనులెంత విశాలమో నని చూపటానికి విశాలే విమలే నేత్రే అని తరుచు ఏకారాలు ప్రయోగిస్తాడు మహర్షి. ఒక నక్షత్ర మెంత తళతళ మంటున్నదో చూపటానికి తారాభి రభిరామాభి రుదితాభిః అని వరుసగా భకారాలు వాడుతాడు. ఒక యుద్ధమెంత భయంకరంగా సాగిందో తెలఎటానికి రరాస భూమి ర్శతతాప భానుమాన్ వవౌన వాయు: ప్రచచాల చాచలః -రరా తత వవ అని అక్షర మావృత్తం చేస్తాడు. అఖరుకు తోక నేల మీద కొడితే అస్పోట యామాస అని దెబ్బ వినిపిస్తాడు. ముద్దు పెడితే చుచుంబ అని ముద్దుగా వినిపిస్తాడు.
Page 45