స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
శివాద్వైతులు. జీవులమని భావిస్తున్న మనమంతా అసలు ఈశ్వర స్వరూపులమే. అయినా ఆ సత్యాన్ని ఎందువల్లనో మరచి పోయాము. అలా మరచి కూడా అర్బుద న్యర్బుదాలైన అనేక జన్మలు గడిచిపోయాయి. కనుకనే దానికి మారుగా మనకీ సకల క్లేశ నివాసమైన సంసారం దాపురమయింది. ఇప్పుడీ భవ బంధం నుంచి విముక్తులమై బయట పడాలంటే మరలా మనమా సహజమైన ఈశ్వర స్వరూపాన్ని జ్ఞప్తి చేసుకోవాలి. జ్ఞప్తి దాని పాటి కది రాదు. జ్ఞాపకమైన సాధన మేదో ఒకటుండాలి. ఆ సాధనం కూడా ఏదో కాదు. ఆ ఈశ్వర చైతన్యంలో నుంచి వచ్చిన దానికి సజాతీయ మైనదే కావాలి. దానిలో నుంచి వచ్చిన దైతేనే మరలా దాని వద్దకు మనలను చేర్చగలదు. దీనినే తార్కికులు లింగ మని పేర్కొంటారు. దూరాన పర్వతం మీద నిప్పుందో లేదో మనం చూడలేదు. కాని పొగ మాత్రం మనకు కనిపిస్తుంటుంది. ఈ కనిపించే ధూమాన్ని బట్టి నిప్పుందని దాని అస్తిత్వాన్ని పట్టుకో గలిగాము. ఎందువల్ల. ధూమమనేది అగ్ని నుంచి జనించింది గనుకనే అగ్నిని మరలా మనకు చూప గలిగింది. ఇదే దానికి లింగం లేదా అభిజ్ఞానం.
అలాగే ప్రస్తుతమీ పృథివ్యాది రూపంగా అష్టధా భిన్నమైన ప్రపంచం కూడా ఒక అభిజ్ఞానమే ప్రపంచాతీత మయిన తత్త్వానికి, ప్రపంచం మనకు -ప్రత్యక్షంగా కనపడుతున్నదే గాని ఆ తత్త్వం మనకలా కనపడటం లేదు. అది మన స్వరూపమే అయినా ఎప్పటి నుంచో మరచిపోయాము మనం. మరలా ఆ విస్మరించిన మన ఆత్మ స్వరూపాన్ని మనమందు కోవాలంటే అందులోనుంచే ఆవిర్భవించిన ఈ సృష్టి ఒక అభిజ్ఞానం. దీనిని పట్టుకొని ప్రయాణం చేస్తే తజ్జన్యమే గనుక అగ్నిని ధూమం లాగా ఇదే మన బుద్దుల నా స్వరూపం దగ్గర చేర్చ గలదు. ఇందులో ఉన్న రహస్య మేమంటే తజ్జలానితి అన్నట్టు చరాచర ప్రపంచ మంతా తజ్జన్యమూ తదాత్మకమే. సువర్ణ జన్యమైన కటక కుండలాదు లన్నీ సువర్ణాత్మకాలే గదా. అలాగే ఈ వన నదీ పర్వతారణ్య పశు మృగ మనుష్యాదికమైన సృష్టి కూడా తదాక్మకమే. అంటే ఇందులో ప్రతి అణువూ శుద్ధ సంవిద్రూప మయిన శివతత్త్వమే .
Page 31