స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
రెంటినీ పర్యాయ పదాలుగా భావించ వచ్చు తప్పులేదు. కాని తేడా ఎక్కడ వస్తుందంటే వారు శివతత్త్వంతో పాటు శక్తి తత్త్వాన్ని కూడా అంగీకరించారు. శక్తి నంగీకరిస్తే తప్పులేదు. పరాస్య శక్తిః స్వాభావికీ అని వేదమే చాటుతున్నది. పరమాత్మ నాశ్రయించి ఆయన మాయా శక్తి ఉందనేంత వరకూ అద్వైతు లంగీకరించినదే. కాని వారాశక్తి పరమేశ్వరాధీనగానే తప్ప స్వతంత్రమైన ఒక పదార్థంగా ఒప్పుకోరు. ఒప్పుకొంటే ద్వైతం వచ్చి పడి అద్వైతానికే ముప్పు వాటిల్లు తుందని వారి అభిప్రాయం. కాగా ఈ శివాద్వైతు లలా కాక శక్తిని స్వతంత్రమైన ఒక తత్త్వంగా భావిస్తారు. శివ తత్త్వ మెలాంటిదో శక్తి తత్త్వం కూడా అలాంటిదే వారికి. ఇది ఒక తేడా అయితే మరొకటి కూడా ఉంది వారి సిద్ధాంతంలో. అద్వైతుల మాయా వాదాన్ని అంగీకరించ రీ శివాద్వైతులు. మాయ దేనికి ఇదొక తడికె మధ్యలో పరమాత్మ సర్వ స్వతంత్రుడు గదా ఆయన తన పాటికి తాను స్వేచ్ఛగానే చేస్తున్నాడీ సృష్టి స్థితి లయాలన్నిటినీ. ఆయన సృష్టియే గనుక అద్వైతులు చెప్పినట్టిది మిథ్య కాదు అనృతం కాదు. అసత్తంతకన్నా కాదని గట్టిగా వాదిస్తారు. అందుకే దీనికి స్వచ్ఛంద వాద మని కూడా ఒక పేరు వచ్చిందీ శివాద్వైతానికి. ఇలాంటి ఒకటి రెండు ముఖ్యమైన తేడాలు తప్ప మిగతా దంతా ఇది ఔపనిషదమైన అద్వైత సిద్ధాంతమే. సందేహం లేదు. పోతే వీరి సాధన మార్గమంతా ప్రత్యభిజ్ఞ మీద ఆధారపడి ఉంది. అభిజ్ఞ అంటే గుర్తించటం. ప్రత్యభిజ్ఞ అంటే మరలా గుర్తించటం. మరలా గుర్తించట మనేది ఎప్పుడు జరుగుతుంది. మొదట గుర్తించి దాన్ని మరచి పోయినప్పుడు. మనమొక వస్తువెక్కడో దాచి పెడతాము పెట్టినప్పుడు మనకది గుర్తే. కాని తరువాత దాని ఊసే మనం పట్టించు కోలేదు. ఆయా వ్యాసంగాలలో పడి దాని విషయం మరచిపోయాము. కొన్నాళ్లకు దానికి సంబంధించిన కాగితాలేవో చూస్తుంటే అది మరలా మనకు జ్ఞప్తికి వస్తుంది. ఇదుగో ఈ జ్ఞప్తికి రావటాన్నే ప్రత్యభిజ్ఞ అని పేర్కొంటారు,. ఇది మన జీవితంలో ఎలాగో జీవిత గమ్యమైన తత్త్వంలో కూడా అలాగే నని చాటుతారు
Page 30