#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

  ఇంతకూ చెప్ప వచ్చే దేమంటే వీరు వారని లేదు. స్త్రీలూ పురుషులని లేదు. ఈ వర్ణ మా వర్ణమని లేదు. ఎవరికైనా సమష్టి జీవితాలోకన క్షమమైన వీక్షణ ముండాలి. ఏకదేశ పర్యవసాయి కాగూడదది. అలా అయితే ఒక జీవనదికీ పల్వలానికీ గల తారతమ్య ముంటుంది వాటికి. ఉంటే సామరస్యం కాదది వైరస్యం. మానవులకే గాడు. మానవాతీత ప్రభావు లనిపించు కొన్న దేవతల కుంటేనే చెల్లదది. మహర్షుల విషయం చూచాము గదా. మహారాజుల విషయం చూచాము గదా. సాక్షాత్తూ శ్రీమహావిష్ణు అవతార పురుషుడైన శ్రీరామ చంద్రుడే అలా సంకుచితంగా ప్రవర్తించాడంటే మెచ్చలేదు కాళిదాసు. ఎవడో ఒక పనికిమాలిన వాడా క్షేపించాడని ఆ నెపంతో నిండు చూలాలిని కారడవులలో దించి రమ్మని ఆజ్ఞాపించాడని తెలిసి వాల్మీకి లాంటి మహర్షే భరించలేక ఇలా అంటా డావిడతో. ఉల్బత లోక త్రయ కంటకేసి సత్య ప్రతిజ్ఞే ప్యవిక తనేపి- త్వాం ప్రత్యకస్మాత్ కలుష ప్రవృత్తా అస్త్యేవ కోపో భరతాగ్రజే మే. అమ్మా లోక కంటకులైన దానవులను రూపు మాపే ఉండవచ్చు. ఆడిన మాట నిలబెట్టుకొనేవాడు కామచ్చు. ఆత్మ స్తుతి పర నింద లేని వాడే కావచ్చు. ఎన్ని మంచి గుణాలున్నా నీ విషయంలో ఇలాటి ఘోరమైన తప్పిదం చేశాడంటే నేను సహించలేను. చాలా కోపంగా ఉంది నీ భర్త అంటే నాకంటాడు. ఎవరీ మాట అంటున్నది. వాల్మీకి. రామాయణ కావ్య కర్త. రాముడు సీతను పరిత్యజించి రాజధర్మం చక్కగా పాటించాడని తన కావ్యంలో ఆయనకు కితా బిచ్చిన వాడు. అలాటి మహర్షి నోటనే ఇలాటి మాట అనిపించాడంటే ఎంత గడుసరో చూడండి కాళిదాసు. ఆయన సమరస భావ దృష్టి చూడండి ఎంత అనన్యా దృశమో. ఆ దృష్టి కొరవడితే ఏ పాత్రనూ మన్నించ లేడాయన. అలాటి పాత్రలను చిత్రించిన ఏ కవినీ భరించలేడు. కనుకనే నేమో కౌలీన భీతేన గృహా న్నిరస్తా - నతేన వైదేహ సుతా మనస్తః. అని తన మనసుకు నచ్చ చెప్పు కొనే వరకూ నిద్ర పట్టలేదా మహా కవికి. సామరస్యమే సారస్య మాయన జీవితానికి. కావ్య జీవితానికి కూడా.

Page 243

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు