#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ఇంతేకాదు. ఇంకొక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం కూడా స్ఫురిస్తుం దాయన అన్న మరొక మాటలో మనకు. ఛాయానమూర్ఛతి మలోప హత ప్రసాదే - శుద్ధే తు దర్పణ తలే సులభావకాశా అంటాడు - శకుంతలకు సంజాయిషీ చెబుతూ. అద్దం మలిన మయినంత వరకూ అందులో మన బొమ్మ కనిపించదు. అదే బాగా శుద్ధమైతే అతి సులభంగా ప్రతిఫలిస్తుంది. దర్శన మిస్తుంది. ఇదుగో ఈ దర్పణ దృష్టాంతం కూడా వారి పట్టిక లోనిదే. ఇంతకూ మృగ తృష్ఠిక - రజ్జు సర్పం మలిన దర్పణం వరుసగా చెప్పిన ఈ మూడు దృష్టాంతాలే చాలు ఆనేపథ్యంలో తొంగి చూచే కాళిదాస మహాకవి శివాద్వయా పర పర్యాయ మైన ప్రత్యభిజ్ఞా దర్శన మర్మాన్ని మనకు పట్టి ఇవ్వటానికి. సిద్దాంత సాధనాను భవాలు మూడూ ఇందులో మనకు భంగ్యతరంగా చాటుతున్నాడు మహా కవి. శివేతర దృష్టితో చూస్తున్నంత వరకూ ఈ సంసార మొక మృగ తృష్టికే మన పాలిటికి. అదే శివాకారమయిన దృష్టితో చూస్తే అసద్రూప మైన సర్పంగా కాక సద్రూపమైన స్రజంగా దర్శన మిస్తుంది. దానికి సాధన మొక్కటే. మన మనస్సు. మనసై వేద మాప్తవ్యం. అద్దం లాంటిది. అయితే అద్దమైనా మలీనమయితే లాభం లేదు. మసృణీ భూతమై ప్రకాశించాలి. అప్పుడే సర్పం లాగా ఆభాస రూపంగా కాక స్రజం లాగా వస్తు రూపంగా కనిపిస్తుందీ ప్రపంచం. కనిపిస్తే మృగతృష్ఠిక వెంట బడ్డట్టీ మిథ్యా రూపమైన అనాత్మ జగత్తు వెంట బడక ఆత్మానాత్మలను రెండింటినీ ఆత్మ రూపంగా దర్శించి ధన్యులం కాగలం. అప్పుడే మమావి చ క్షపయతు నీల లోహితః - పునర్భవమని చాటిన పునరావృత్తి రహితమైన మోక్ష సుఖాన్ని కూడా చూర గొన గలం. ఇలాంటి నిక్షేపాన్ని మనకు ప్రసాదించటమే కాళిదాస రచనా శిల్పాని కంతటికీ ప్రయోజనం. ఆ ప్రయోజనాని కనుగుణంగా మలుచు కొంటూ వచ్చినదే ఆయన కావ్య నాటక రచనా ప్రపంచమంతా.

Page 120

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు