#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

కాదిక్కడ. మేనక. అది అప్సరస కాబట్టి పరభృత. పరుల పోషణలో ఉన్నదని అర్ధం. కోకిలకు కూడా పరభృత అనే పేరు. అప్సరస కూడా పరకీయే గనుక అదీ పరభృతే. అన్యై ర్ద్విజైః పోషయంతి- ద్విజ అంటే పక్షి అనీ అర్ధమే. బ్రహ్మర్షి అనీ అర్ధమే. మరొక పక్షిచేత పోషింప జేసుకొంటుంది కోకిల . అలాగే మరొక మహర్షి చేత చేసుకొంటుంది మేనక. అన్యైః అని బహువచనం వాడటంలో ఇద్దరు వస్తున్నారు. ఒకరు కణ్వ మహర్షి. మరొకరు కశ్యప మహర్షి. వీరిద్దరికే అప్పగించి వారి పోషణలోనే గదా ఉంచింది తన కూతురు శకుంతల నావిడ. అదీ ఎప్పుడని. ప్రాగంతరిక్ష గమనాత్- ఈ మాట వ్యస్తంగా విరిచి చెబితే అంతరిక్ష గమనాత్ ప్రాక్ అంతరిక్షంలో ఎగిరి పోవటానికి ముందని అర్ధం. అంతే గదా మరి. శకుంతల స్వర్గానికి పోక ముందంతా కణ్వుని దగ్గరే పెరుగుతూ వచ్చింది. నడుమ నగర ప్రవేశం చేసినా అది యత్తించిత్కాలమే. కాగా ఈ మాటనే సమస్తంగా భావించి అర్ధం చెప్పినా చెప్పవచ్చు. అప్పుడు ప్రాగంతరిక్ష మంటే అకాశంలో తూర్పు దిశ అని అర్థం. తూర్పు దిశగా ఉన్నదే దేవలోకం. ఆ లోకానికి గమనం చేసి అక్కడ మరలా తన బిడ్డను మహర్షి పోషణలో ఉంచింది మేనక. ఆ మహర్షే కశ్యప ప్రజాపతి. అక్కడే ఉంది తరువాత శకుంతల. ఇలా శకుంతలా వృత్తాంతం పూర్వాపరాలను రెంటినీ భాసింప జేస్తున్నదీ పద్యం దేహళీ దత్త దీప న్యాయంగా నాటక మధ్యంలో చేరి. అంతేకాదు. శకుంతలను మేనకే గాక శకుంతల తన కుమారుడు భరతుణ్ణి కూడా కశ్యపుడనే ద్విజోత్తముడి పోషణలోనే ఉంచిందని కూడా ధ్వనిస్తున్న దిందులో. ఇందులో మరొక చమత్కారం కూడా దొరలింది. అమానుషీషు అనే మాటలో మానవులు కాని పశుపక్ష్యాదులు కావచ్చు. మానవాతీతమైన దేవ జాతి కావచ్చు. అలాంటప్పుడు దేవతా స్త్రీలైన మేనకాదులని కూడా అర్ధం చెప్పుకోవచ్చు మనం. అది ఎంతైనా సందర్భోచితం. ఈ ఒక్కటి చాలు మహా కవి రచనా శిల్పానికి గీటు రాయిగా చెప్పుకోటానికి.

Page 110

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు