#


Back

జగద్గురు

జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులొక అనన్య సామాన్యమైన వ్యక్తి. ఆయన మన భారతదేశంలో జన్మించటం నిజంగా మన భారతీయుల కొక గర్వకారణం. అయితే ఆయన ఏ శతాబ్దంలో జన్మించాడనే విషయం మాత్ర మిప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. క్రీస్తుకు పూర్వమని కొందరంటే తరువాత అని కొందరంటున్నారు. అయినా ఏ శతాబ్దంలో ఎప్పుడు జన్మిస్తేనేమి, ఎప్పుడూ, ఎక్కడా అనేవి మనకు ప్రధానం కావు. ఆయన భాషలోనే చెబితే అవి కేవలం వ్యావహారికమే. అలాంటప్పుడనవసరంగా వాటిని గురించి మనం తలబ్రద్దలు చేసుకోవటం దేనికి. అనావశ్యకం. ఆయన ఎప్పుడైనా జన్మించి ఉండవచ్చు. ఎక్కడైనా జన్మించి ఉండవచ్చు. మొత్తంమీద అలాంటి మహానుభావుణ్ని మాత్రం మనమిక చరిత్రలో మరలా చూడబోమే. ఏమి కారణం. ఆయన ఈ మానవ లోకాని కుపదేశించిపోయిన విజ్ఞానమలాంటిది. అది పరిపూర్ణమైన అద్వైత విజ్ఞానం. సృష్టికంతా సారం మానవుడైతే-మానవుడికి సారమాతని విజ్ఞానమైతే, ఆ విజ్ఞానానికంతటికీ పరమసారమద్వైత విజ్ఞానమే.

అదేమిటి-మానవుడీలోకంలో ఆర్జించిన విజ్ఞానమెంతో ఉంది గదా. లోక జ్ఞాన Common Sense ముంది శాస్త్రజ్ఞాన Scientific sense ముంది. కళాజ్ఞాన Artistic sense ముంది. ఇన్ని జ్ఞానాలుండగా ఇందులో దేనికీ లేని విశిష్టత ఈ అద్వైత విజ్ఞానానికే ఎలా ఏర్పడిందని ప్రశ్న వస్తుంది వాస్తవమే. మానవుడార్జించిన విజ్ఞానమెంతో ఉంది. సందేహం లేదు. కాని ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా అవన్నీ చివరకు నిరుపయోగమే. కారణమేమంటే వాటిన్నింటిలోనూ రెండు ప్రబలమైన దోషాలున్నాయి. ఒకటి అపేక్ష Relativity. మరొకటి బాధ Controversity అపేక్ష అంటే దీని తరువాత ఏమిటనే ప్రశ్న. ఈ ప్రశ్న మనం సాధించిన ప్రతి విజ్ఞానంలోనూ పొడచూపుతుంది. చూడండి. మనమే విజ్ఞానాన్ని ఎంత సాధించినా ఇంకా సాధించవలసింది ఉండనే ఉంటుంది. సాధించింది ఒక బిందువైతే సాధించవలసింది ఒక మహాసముద్రం. ఎంత ఈదినా దాని తీరం చేరుతామనే ఆశ ఎప్పటికీ లేదు జీవితంలో. కాబట్టి అపేక్ష అనే దోషమొకటి ఉంది మన జ్ఞానానికి.

అలాగే బాధ అనే దోషం కూడా ఒకటుంది. బాధ ఏమిటి. బాధ అంటే మనమెందులో ఎంత జ్ఞానం సంపాదించినా అది పనికి రాకుండా పోవటం. ఇది కూడా మన కనుభవ సిద్ధమే. చూడండి. ప్రతి రంగంలోనూ మన మెంతెంతో పరిశోధన చేస్తున్నాము. ఎన్నెన్నో విషయాలు తెలుసుకొంటున్నాము. అవన్నీ అప్పటికప్పుడు సత్యమనే నమ్ముతుంటాము. కానీ అంతకన్నా ముందుకు పోయి మరి ఒక క్రొత్త రహస్యం కనుగొనే సరికంతకు ముందరిదంతా బలాదూరవుతున్నది. అది మరి కొంతదూరం ప్రయాణం చేసే సరికి పేలవమయి పోతున్నది. ఈ విజ్ఞాన యాత్ర ఇలా నిరంతరమూ కొనసాగవలసిందే గనుక చివరకంతా బాధితం కాక తప్పదు. ఏతావతా తేలిందేమంటే మానవుడార్జించిన ఆర్జిస్తున్న ప్రతి ఒక్క విజ్ఞానమూ కూడా అపేక్షా బాధలనే ఈ రెండు దోషాలకూ గురి కావలసిందే. అది నీవు లోకజ్ఞానమని చెప్పు. శాస్త్రమని చెప్పు. కళాజ్ఞానమని చెప్పు. ఏదైనా సరే. రెండింటి కబంధ హస్తాల నుంచీ తప్పించుకొని బయటపడడం కల్ల.

కాగా ఈ రెండు లక్షణాలూ లేని విజ్ఞానమేదైనా ఉందంటే అది ఒక్క అద్వైత విజ్ఞానమే. ఎంచేతనంటే అసలద్వైతమని పేరు పెట్టటంలోనే ఉన్నదా రహస్యం. అద్వైతమంటే ఏమిటి. రెండవ పదార్ధమంటూ ఏదీలేదు. ఉన్నదంతా ఒక్క ఆత్మచైతన్యమే నని గదా, చైతన్యం తప్ప మరొకటేదీ లేదన్నప్పుడిక అపేక్ష ఏముంది. బాధ ఏముంది. ఇది గాక మరొకటున్నదని ఒప్పుకొన్నప్పుడే వాటి రెంటికీ అవకాశమేర్పడేది. లేకుంటే అసలాస్కారమే లేదు వాటికి. అపేక్షా బాధలు రెండూ లేవంటే అది ఒక పరిపూర్ణమైన జ్ఞానం కాక తప్పదు. ఇలాటి పరిపూర్ణమైన జ్ఞానమే అద్వైత జ్ఞానం.

అంతేకాదు. పరిపూర్ణ మెప్పుడయిందో అప్పుడిక పురుషార్థమనేది కూడా దానితోనే పరిసమాప్తమవుతున్నది. పురుషుడు కోరేదేదో అది పురుషార్ధం The aim and goal of human life. పురుషుడంటే మానవుడే, మానవులందరూ కోరే పదార్ధాలు రెండే ప్రపంచంలో. అన్నీ తెలుసుకోవాలని ఒకటి. అనవరతమూ సుఖంగా బ్రతకాలని ఒకటి. ఇంతకు మించి మరేదీ కానరాదు. ఇందులో మొదటి దానికి జిజ్ఞాస అనీ, రెండవదానికి ముముక్ష అనీ పేరు పెట్టారు మన ప్రాచీనులు. ఇవి రెండూ నెరవేరే వరకూ పురుషార్థమనే దానికి మనం నోచుకోలేము. అద్వైత మన్నప్పుడింకొక భావానికే అసలాస్కారం లేదనిగదా చెప్పాము. అలాంటప్పుడిక జిజ్ఞాస ముముక్షలు మాత్రమెక్కడివి. ఇవి కూడా వాటిపాటి కవి సమసి పోవలసిందే. పోతే పురుషార్థమనేది మన కప్రయత్నంగానే సిద్ధిస్తుంది. అంచేత మానవుడు సాధించిన అన్ని విజ్ఞానాలకూ ఆఖరిమెట్టు అద్వైత విజ్ఞానమే. అవి సాపేక్షమైతే Relative ఇది నిరపేక్షం Absolute. అవి సబాధమైతే Contradicted ఇది నిర్బాధం Uncontradicted ఇది అద్వైత విజ్ఞానానికుండే విశిష్టత.

ఇలాంటి విలక్షణమైన జ్ఞానాన్ని మనకు బోధించగలిగారంటే అలా బోధించిన భగవత్పాదులెంతటి మహనీయులో వేరుగా చెప్పబని లేదు. అసలు వారికి భగవత్పాదులని బిరుద మేర్పడటంలోనే మనకీ విషయ మవగత మవుతుంది. తెలియవలసినదంతా తెలుసుకొని దాన్ని అనుభవానికి తెచ్చుకొన్న పూర్ణ పురుషులే భగవత్పాదులు. శంకరులలాంటి పూర్ణ పురుషులు. వారికి పరమార్ధమంతా చేతిలో వెన్నముద్దలాగా స్వానుభవానికి వచ్చింది. అనుభవమనేది లేకుంటే ఏదిగానీ ఒక సిద్ధాంతంగా Doctrine or theory బయటికి రాదు. మానవుల సిద్ధాంతాలన్నీ Concepts వారి వారి అనుభవాలకు ప్రతీకలే Indications. సిద్ధాంతా లన్నిటికీ తలమానిక మద్వైత సిద్దాంతమని గదా ప్రతిపాదించాము. అలాంటప్పుడది ఎవరి అనుభవానికి రాకుండానే ఎలా అవతరించగలదు. ఒకవేళ అవతరించిందని వాదించినా దాని కర్థమేముంది. కాబట్టి దాని నొక సిద్ధాంతంగా శంకర భగవత్పాదులు లోకానికి చాటారంటే ఆయన కది ముందుగా అనుభవ గోచరమయి ఉండవలసిందే, ఇందులో అనుభవానికి తెచ్చుకోవటం వల్లనే ఆయన భగవత్పాదులయ్యారు. అలా తెచ్చుకొన్న విజ్ఞానాన్ని మరలా ఈ మానవ సమాజాని కుపదేశించి పోవటంవల్ల ఆయన జగద్గురువులు కూడా అయ్యారు.

అయితే మనకిక్కడ ఒక ఆశంక కలగవచ్చు. శంకరులు బోధించారని చెప్పే ఈఅద్వైత విజ్ఞానమంతకు ముందునుంచీ మన ఉపనిషద్వాఙ్మయంలోనే ఉంది గదా. ఇక ఆయన మనకు క్రొత్తగా చేసిన బోధ ఏమిటి అని. అదీ వాస్తవమే. ఉపనిషత్తులలోనే ఉన్నాయి అద్వైత జ్ఞాన రత్నాలన్నీ. సందేహం లేదు.కాని అవి బాగా లోతుకు దిగి గాలించినప్పుడే చేతికందేది. ఆ పాతతః చూచామంటే వాటిలో ఒక్క అద్వైతమే గాదు. సాంఖ్యయోగాది ద్వైతవాసనలు కూడా గుబాళిస్తుంటాయి. ఎక్కడికక్కడే మనకుపనిషత్తుల భావమిదే కావచ్చుననే భ్రాంతి ఏర్పడుతుంది. మనకేమిటి. అసలు పెద్ద పెద్ద మతాచార్యులకే ఏర్పడింది ఇలాంటి అపోహ. కనుకనే ఎవరికి తోచినట్లు వారు ఉపనిషద్వాక్యాలకు వ్యాఖ్యానాలు వ్రాస్తూ వచ్చారు. దానితో అసలుపనిషత్తాత్పర్య Import మేమిటో ఎవరికీ అంతు పట్టకుండా మరగున బడిపోయింది. అలాంటి పరిస్ధితిలో అవతరించారు శంకర భగవత్పాదులు. అలా అవతరించి పరస్పర విరుద్ధంగా కనపడే భావాలనన్నిటినీ సమన్వయించి ఉపనిషత్తులన్నిటికీ కలిపి ఒక్క అద్వైతమే వివక్షిత Intention మని ఆయన సిద్ధాంతం చేశారు.

ఇది ఒక్క ఉపనిషత్తులకేగాదు. ఆ మాటకు వస్తే శ్రుతులకన్నింటికీ కూడా అద్వైతమే పరాయణమని ఆయన చేసిన తీర్మానం. ఋగ్యజుస్సా మాథర్వణాలనే నాలుగు శ్రుతులూ ఒక జ్ఞానకాండనే గాక విధ్యుపాసన రూపమైన కర్మకాండను గూడా ప్రతిపాదిస్తాయి. ఇందులో జ్ఞానకాండ అనబడే ఉపనిషత్తులొక వేళ అద్వైత భావాని కనుకూలమైనా కర్మకాండ మాత్రమలా అయినట్టు కనిపించదు. కర్మ అనేది దాని స్వరూపాన్ని బట్టి చూచినా అది ఇచ్చే స్వర్గాది ఫలాన్ని బట్టి చూచినా కేవల మీద్వైత ప్రపంచంతోనే ముడిబడి ఉన్నట్టు తోస్తుంది. కానీ చిత్రమేమంటే ఆ కర్మలు కూడా కామ్యవర్జితంగా ఆచరిస్తే చాలు. మానవుడికి చిత్తశుద్ధిని ప్రసాదించి తద్ద్వారా జ్ఞానోత్పత్తికే దోహదం చేస్తాయి. అప్పటి కుపనిషత్తులు సాక్షాత్తుగా Direct నైతే కర్మోపాసనలు రెండూ పరంపరగా Indirect సాధనాలవుతాయి అద్వైతానికి. దీనిని బట్టి కాండద్వయాత్మకమైన శ్రుతికంతటికీ అద్వైతమే పరమార్ధమని ఏక వాక్యతను Uniformity నిరూపించారు శంకరులు.

శ్రుతులకు నిరూపించ గలిగారంటే ఆ శ్రుతుల అడుగుజాడలలో పయనించేవే మను యాజ్ఞవల్క్యాది స్మృతులు కూడా. కాబట్టి వాటికి కూడా నిరూపించి నట్టయింది. పోతే ఈ శ్రుతి స్మృతులలోని భావాలనే కథా రూపంగా బయట పెడతాయి ఇతిహాస పురాణాలు. కనుక వాటికి కూడా ఇదే తాత్పర్యమని చాటినట్టయింది. మొత్తంమీద శ్రుతి స్మృతి పురాణేతి హాసభేద భిన్నమైన సమస్త వాఙ్మయానికీ అద్వైత జ్ఞానమొక్కటే చివరకు పరాయణమని ఆయన చేసిన సమన్వయం.

మరి ఈ సమన్వయ ప్రయత్నమింతటితో ఆగలేదు. శాస్త్ర ప్రమాణాన్నే గాక లౌకికమైన ప్రత్యక్షాదులను కూడా ఆయన దాని పరిధిలోకే లాగ గలిగారు. అది మరీ అద్భుతం. ''అహం బ్రహ్మాస్మి - ఇత్యేద దవ సానా ఏవ సర్వే విధయః సర్వాణిచ ప్రమాణాని'' అని ఆచార్యులవారు సెలవిచ్చిన వాక్యం. అహమ్‌ బ్రహ్మాస్మి అనే అఖండాత్మ భావంతో సమాప్తమయ్యేవే సకల కర్మలూ, సర్వ ప్రమాణాలూ. సర్వ ప్రమాణాలూ అన్నప్పుడొక వాఙ్మయ జగత్తే Litarary World గాదు. చరాచర రూపమైన ఈ భౌతిక జగత్తు Material world కూడా కలిసి వస్తున్నది. వాఙ్మయ జగత్తు శబ్ద ప్రమాణానికైతే మిగతా జగత్తంతా ప్రత్యక్షాదులకు గోచరమయ్యేదే. దీనిని బట్టి మనకు తేలిందేమిటి. స్థావర జంగమాత్మకమైన సృష్టి కంతటికీ కూడా అద్వైత విజ్ఞానమే ఏకైక లక్ష్యమనీ దాని కభిముఖంగా అణువు మొదలు ఆకాశం దాకా ప్రతి ఒక్కటీ ఈ లోకంలో పయనిస్తున్నదనీ ఒక గొప్ప సమన్వయ Grand synthesis మేర్పడుతున్నది.

ఇలాంటి సర్వతోముఖమైన Comprehensive సమన్వయమిప్పటి వరకూ ప్రపంచ చరిత్రలో ఏ మతాచార్యుడూ చేయలేదు. ఇక చేయబోడు. ప్రతిఒక్కరూ తత్త్వాన్ని ఏకముఖంగానే చూచి సిద్ధాంతాలు చేస్తూ వచ్చారే గాని సమష్టిరూపంగా దర్శించిన వారు కాదు. వారి దృష్టి చూస్తే గ్రుడ్డివాండ్లు ఏనుగును చూచిన వ్యవహారం జ్ఞాపకం వస్తుంది. ప్రతి ఒక్కడూ ఏనుగును చూచినవాడే. కాని పూర్తిగా మాత్రం కాదు. అందులో తోక పట్టుకొని ఒకడు బల్లెంలాగా ఉందంటే-తొండం బట్టుకొని ఒకడు రోకలిలాగా ఉందంటాడు. అది దాని సమష్టి రూపమెలా అవుతుంది. అలాగే ఈ దర్శనాలలో ఏదీ కూడా సమగ్రమైనది కాదు. కాదు గనుకనే శంకర భగవత్పాదులందులో ప్రతి ఒక్క దానిని సరి దిద్దవలసి వచ్చింది.

శంకరుల వారికి షణ్మత స్థాపకులని ఒక పేరున్నది. శైవం వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, కౌమారం ఈ ఆరింటినీ షణ్మతాలని వ్యవహరిస్తారు. ఇవి ఆరూ కూడా ఆస్తిక దర్శనాలే. అయితే ఎవరికి వారు తమ దైవతమే సర్వోత్కృష్టమని వాదిస్తారు. అది కేవలం పాక్షికమైన దృష్టి షణ్మతాలనేవి అసలు భగవంతుడిలోని షడ్గుణాలను బట్టి అవతరించాయి. జ్ఞానైశ్వర్యశక్తి బలవీర్య తేజస్సులనేవే ఆ షడ్గుణాలు. అవి ఆరూ అభిన్నంగానే ఉన్నాయి భగవత్తత్త్వంలో. అభిన్నమైన ఈ గుణాలను పరస్పర విలక్షణంగా భావించటం మూలాన్నే ఇన్నిమతాలేర్పడ్డాయి. వీటిలో వైష్ణవం జ్ఞాన ప్రధానం. శైవమైశ్వర్య ప్రధానం. శాక్తేయం శక్తి గుణ ప్రధానం. ఇలా ఒక్కొక్క గుణాన్ని వేరు చేసి తీసుకోటంవల్ల దైవం వేరు కావటం వల్లఅది పరస్పర విద్వేషాలకు నాందీ పలికింది. నిజానికిన్ని గుణాలూ లేవు. ఇన్ని దైవతాలూ లేవు. షడ్గుణ సంపన్నుడైన భగవానుడొక్కడే. గుణాలన్నీ ఆయన తాలూకు విభూతులే Aspects అని సమన్వయించి చూపారు భగవత్పాదులు. ''సచ భగవాన్‌ జ్ఞానైశ్వర్య బలవీర్య తేజశ్శక్తిభి స్సదా సంపన్నః'' అని గీతా భాష్య ముఖంలో ఆయన సెలవిచ్చిన సూక్తి. ఇదీ వారు చేసిన షణ్మత స్థాపన.

అప్పుడెప్పుడో ఆయన షణ్మతాలకు చేసిన సమన్వయం ఇప్పుడున్న షణ్మతాలకు కూడా సరిపోతుందంటారు అభిజ్ఞులు. ఇప్పుడున్న షణ్మతాలు మన హైందవం మినహాయిస్తే ఆరు. బౌద్ధం-జైనం, క్రైస్తవం-మహమ్మదీయం యూదుమతం-జరదుష్ట్ర మతం. ఇవి కూడా భగవంతుడిలోని షాడ్గుణ్యానికి ప్రతీకలే గాని వేరు గావు. ఒక్కొక్క గుణాన్ని ప్రధానంగా తీసుకొని ఒక్కొక్క మతం చలామణిలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ దృష్టితో చూస్తే బౌద్ధం శాక్తేయానికీ, జైనం శైవానికీ, క్రైస్తవం కౌమారానికీ, మహ్మదీయం వైష్ణవానికీ యూదుమతం గాణాపత్యానికి, జరదుష్ట్ర మతం సౌరానికీ, సహోదరాలని చెప్పవచ్చు. అంచేత వాటిని సమన్వయించారంటే శంకరులు వీటిని కూడా సమన్వయించారనే అర్థం. సర్వతోముఖమైన దృష్టికి దేశకాలాలనే అవధులుండ బోవని దీనిని బట్టి మనకు తేటపడుతున్నది.

షణ్మతాలంటే శైవ, వైష్ణవాదులనే గాక షడ్దర్శనాలని కూడా అర్ధమే. న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ పూర్వోత్తర మీమాంసలకు షడ్దర్శనాలని పేరు. ఇందులో న్యాయవైశేషికాలు రెండూ హేతువాద ప్రధానాలు. ఆత్మేశ్వర తత్త్వాలను హేతువాదంతో నిరూపిస్తారు తార్కికులు. అంతవరకూ ఫరవాలేదు. కాని అవి రెండూ పరస్పర భిన్నమని వాదిస్తారు. పైగా ఆత్మను కూడా ఒకద్రవ్యమని Substance పేర్కొంటారు. అది అర్ధం లేని మాట. అంతేగాదు. వీరు సత్కార్యవాదులు గారు. అసత్కార్యవాదులు. వీరి దృష్టిలో సృష్టికి పూర్వ మీ ప్రపంచాని కస్తిత్వం లేదు. తరువాత క్రొత్తగా ఆరంభమయిందని వర్ణిస్తారు. ఇది కూడా యుక్తిసహం కాదు. అంచేత శంకరులీ రెండంశాలనూ సవరించవలసి వచ్చింది.

అలాగే సాంఖ్య యోగాలను కూడా సంస్కరించాడాయన. సాంఖ్య యోగాలలో సాంఖ్యమనేది నిరీశ్వరం Atheistic. యోగం సేశ్వరం Theistic అయితే వీరిద్దరూ సత్కార్యవాదులే. ప్రపంచం సృష్టికి పూర్వ మవ్యక్తంగా ఉండి తరువాత వ్యక్త Manifest మవుతుందని వీరి వాదం. ఇందులో సత్కార్యమని చెప్పటం వరకూ ఆచార్యుల వారి కొప్పుదలే. కాని అవ్యక్తం వ్యక్తంగా పరిణమిస్తుందని చెప్పటం మాత్రం సమ్మతం కాదు. అలాగే వారి జీవనానాత్వవాదమూ స్వతంత్ర ప్రకృతివాదమూ, ఆయనకెంత మాత్రమూ సరిపడలేదు. కాబట్టి ఆ రెండింటినీ ఆయన యథోచితంగా పరిష్కరించాడు.

అలాగే పూర్వోత్తర మీమాంసల మీద గూడా ఆయన ఈ పరిష్కరణా యుధాన్నే ప్రయోగించవలసి వచ్చింది. మీమాంస అంటే వేద తాత్పర్య The import of veda మేమిటనే విచారణ. అది పూర్వమనీ, ఉత్తరమనీ రెండు భాగాలు. రెండూ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవే. అందులో పూర్వ మీమాంస శరీరానికి భిన్నంగా జీవుడనే వాడొకడున్నాడనీ వాడికి కర్మ ఫలానుభవ ముందనీ అందుకోసం వాడికి లోకాంతర జన్మాంతరా లేర్పడుతాయనీ, వర్ణిస్తుంది ఇంతవరకూ శంకరుల కెలాటి ఆక్షేపణా లేదు. వ్యావహారికంగా ఈ కలాపమంతా ఒప్పుకొంటాడాయన. కాన జీవుడికి విలక్షణంగా మరేమీ లేదు. తుదకు ఈశ్వరుడు కూడా లేడనే మీమాంసకుల మాట ఎంత మాత్రమూ ఒప్పుకోడాయన. అలాగే జ్ఞానరహితమైన కర్మలచేతనే పరమ పురుషార్ధం ప్రాప్తిస్తుందని వారు వాదించటం కూడా ఆయనకు సబబుగా తోచలేదు. కనుక వాటి రెండింటికీ తగిన పరిష్కారం చేసి చూపాడాయన.

పోతే ఇక ఉత్తర మీమాంసకు లొకరున్నారు. వారికి వేదాంతులని కూడా పేరున్నది. వేదాలకు చివరిదైన ఉపనిషత్తులు వీరికి ముఖ్య ప్రమాణం. కర్మ మీమాంసకుల మాదిరి గాక సాక్షిరూపమైన ఆత్మతత్త్వమొకటి ఉందని వీరు గుర్తించారు. అంతవరకూ బుద్ధిమంతులే. కాని వేదాంతులనే వారంతా అద్వైతులు కారు. వారిలో ద్వైతులూ ఉన్నారు. విశిష్టాద్వైతులూ ఉన్నారు. వారిద్దరి అభిప్రాయాలూ వేరు. వారు జీవాత్మ పరమాత్మలకు భేదం చెబుతారే గాని అభేదాన్ని సుతరామూ అంగీకరించరు. అంతేగాక ఈ కనిపించే జగత్తంతా సత్యమే గాని ఆభాస గాదు వారి దృష్టిలో. సృష్టి అనేది యధార్థంగానే జరిగిందని వారి మతం. ఇదుగో ఇలాంటి భేద దృష్టి వేదాంతుల కుండటాన్ని ఏ మాత్రమూ మన్నించరు భగవత్పాదులు. కనుక మిగతా వారివలెనే వీరిని కూడా ఆయా సందర్భాలలో చక్కదిద్ది సరియైన మార్గం చూపుతూ వచ్చారు. ఈ విధంగా షడ్దర్శానాలలోనూ అంతర్లీనంగా ఉండే లోపాలను సవరించి గుణాలను సమర్ధించటంవల్ల కూడా ఆయనకు షణ్మత స్థాపకుడనే ప్రసిద్ధి ఏర్పడి ఉండవచ్చు.

మొత్తంమీద జగద్గురువుల సమన్వయ దృష్టి మరి ఏ మతాచార్యునికీ కానరాదు. ఒక మధుకరం లాంటి దృష్టి అది. మధుకరమన్ని పుష్పాలపైనా వాలుతుంది. అన్ని రసాలనూ సేకరిస్తుంది. ఒకే మధురసంగా మారుస్తుంది. మనమా మధువును సేవిస్తుంటే ఇది పనస-ఇది ఆమ్ర-ఇది బదరి-ఇది కదళి అనే భేదం మనసుకు రాదు. అంతా కలిసి ఒక సమష్టిగా అనుభవానికి వస్తుంది. ఇలాంటి ఒకానొక సమష్టి రూపమైన దృష్టి ఆచార్యుల వారిది. ఇంత గొప్ప దృష్టి అలవడటంవల్లనే ఆయన శ్రుతి స్మృతి పురాణేతి హాసరూపమైన వాఙ్మయానికంతటికీ ఏకవాక్యతా రూపమైన చక్కని సమన్వయాన్ని సాధించగలిగారు. ఈ సమన్వయం మూలాన్నే అద్వైత విజ్ఞానమనేది మొదటి నుంచీ మన ఉపనిషత్తులలోనే గుప్తమయి ఉన్నప్పటికీ స్వామివారి చేతిలోబడి అది మరలా ఒక సానబెట్టిన రత్నంలాగా ప్రకాశించగలిగింది. సరిక్రొత్తగా మనకు భాసించగలిగింది. భగవత్పాదులే లేకపోతే ఇంత అనర్ఘమైన రత్నాన్ని బయటికి తీసేవారూ లేరు. దాని కాంతి రేఖలు మన మనః ఫలకాలమీద ప్రసరించేవీ కావు.

మరి ఇంత విలువైన నిక్షేపాన్ని మనకాయన ప్రసాదించి పోయారంటే మనమా మహనీయుడి కెంతగా ఋణపడి ఉన్నామో చెప్పనక్కరలేదు. మనమంటే ఒక్క భారతీయులమే గాదు. భూమండలంలో ఉండే సమస్త మానవులూ కూడా ఋణగ్రస్తులే. ఈ ఋణ భారం నుంచి విముక్తులం కావాలంటే మనమంతా కలిసి చేయవలసిన కార్యమేమిటి. ఆయన ప్రసాదించి పోయిన అద్వైతామృత రసాన్ని తనివిదీర ఆస్వాదించి అమర్త్య భావాన్ని అందుకోటమే తప్ప మరేదీ గాదు.

అయితే ఈ పాటికి మనమెంతో విజ్ఞానమార్జించాము గదా. అద్వైత విజ్ఞానమొక్కటి లేకపోతే మనకు మొక్క పోయిందేమిటని అడగవచ్చు. మనమెంత విజ్ఞానమార్జించినా - ఎన్ని అంతరిక్షయానాలు సాగించినా - అదంతా కేవలం సాపేక్షమే Relative ననే మాట మరచిపోరాదు. సాపేక్షమైన జ్ఞానమది ఎంత గొప్పదైనా సరే, మానవుడి సమస్యను పూర్తిగా పరిష్కరించలేదు. తీరే సమస్య తీరుతుంటే మరలా క్రొత్తది వచ్చి నెత్తిన పడుతుంటుంది. అన్ని సమస్యలూ తీరటమంటూ ఎప్పటికీ సంభవం కాదు. తీరే పరిస్థితే ఉంటే ఇంతకాలం నుంచీ మనమింత నాగరికత గడించినందుకది ఎప్పుడో తీరిపోవలసింది. ఏదీ నాగరికత పెరిగే కొద్దీ సమస్య కూడా దానితోపాటు పెరగటమే గాని తరగటం లేదే. దీనిని బట్టి సాపేక్షమైన మన లౌకిక విద్యలలో సమస్యకు పరిష్కారమే లేదని స్పష్టమవుతున్నది. మానవుడి సమస్యనే తీర్చలేనిదది విద్య ఎలా అయింది. కనుకనే ఈ శాస్త్రాలూ, కళలూ, అసలు విద్యలే గావు. అవిద్యలు Neseience పొమ్మన్నారు మన ప్రాచీనులు. అవిద్యా క్షేత్రంలో ఎంత కృషి చేసి ఏమి ప్రయోజనం. ఊషర క్షేత్రంలో సల్పిన కృషి లాగా అది నిష్పలమే. మరి ఫలితమే కావాలంటే నిరపేక్షమైన Absolute బ్రహ్మవిద్యనే పట్టుకోవాలి మానవుడు.

అది జగద్గురువులు బోధించిన ఈ అద్వైత విజ్ఞానం తప్ప మరొకటి నభూతమ్‌ నభవిష్యతి. సకల సంశయోచ్ఛేదకమైన ఆత్మ విజ్ఞాన Subjective మది. కాబట్టి దాని ముందు మిగతా అనాత్మ విద్య Objective లన్నీ బలాదూరయి పోవలసిందే. అంచేత జిజ్ఞాసా శీలుడైన మానవుడెప్పటికైనా సరే, సంగీతమనీ, సాహిత్యమనీ ఇలాంటి కళలతోనూ, వైద్యమనీ, జ్యౌతిషమనీ ఇలాంటి శాస్త్రాలతోనూ తన విలువైన కాలాన్ని వెళ్ళబుచ్చటం శ్రేయోదాయకం కాదు. కేవలం ప్రేయోదాయకమే అవి. ప్రేయస్సు వేరు. శ్రేయస్సు వేరు. తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చేది ప్రేయస్సు. సార్వకాలికమైన నిర్వృతిని ప్రసాదించేది శ్రేయస్సు. అలాంటిది మానవులకీ శాంకరమైన విజ్ఞానమొక్కటే. ఎంతటి మేధావంతుడికైనా కళా తపస్వికైనా జీవితంలో చిట్టచివరకది తప్ప వేరు శరణం లేదు. కాదనుకొంటే ఈ జీవితమొక శుష్కమైన అరణ్యమే.

ఇలాంటి అమూల్యమైన విజ్ఞానాన్ని జగద్గురువులు మనకందించి పోయినందుకు మనం దానినందుకొని అనుభవించగలగాలి. దాని కోసం భగవత్పాదుల రచనలన్నీ ఆమూల చూడంగా పరిశీలించి చూడటం తప్ప మరి ఒక మార్గం లేదు. వారి కావించిన రచనలు కూడా ఒకటిగాదు. రెండు గావు. పరశ్శతంగా ఉన్నాయి. అయితే వాటిన్నటిలోనూ మకుటాయ మానంగా కనిపించేవి వారి భాష్యగ్రంథాలు మాత్రమే. అవి మూడూ మూడు మహా సముద్రాలనే చెప్పవచ్చు. అద్వైత వేదాంత రత్నాలన్నీ అందులోనే నిక్షిప్తమయి ఉన్నాయి. ఒక రత్నాకరాన్ని మథించినట్టే వాటిని మథించి మన మా రత్నాలనన్నిటినీ వెలికి తీయవలసి ఉంటుంది.

కాని ఇదికూడా అంత సుకరమైన పనిగాదు. భగవత్పాదుల శైలి ఎంత సరళ Simple మైనదో అంత శాస్త్రీయ Scientific మైనది. ఎంత ప్రసన్నమైనదో Clear అంత గంభీర Deep or Profound మైనది. ఎంత సంక్షిప్త Precise మైనదో అంత సాంగోపాంగ Comprehensive మైనది. ఒక్క మాటలో చెబితే అన్యూనానతిరిక్తమైనదా రచన. ఒక్క మాట వేయటానికి లేదు. తీయటానికి లేదు. ఎంత భావమో అంత భాష. ఎంత భాషో అంత భావం. అలాంటి చిక్కణమైన రచన నవగాహన చేసుకోవటమే కష్టసాధ్యం. దీనికి తోడు అవి స్వతంత్రమైన గ్రంథాలు కావు. ఆయా మూల గ్రంథాలకు స్వామివారు చేసిన వ్యాఖ్యానాలు. అంచేత వేదాంత శాస్త్ర ప్రమేయ (Scope of the subject) మంతా మనకొక్క చోట లభించదు. ఒక్క వరసలో కూడా లభ్యం కాదు. మణులూ, మాణిక్యాలలాగా అమూల్యమయిన ఆయన భావాలన్ని అక్కడక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటన్నిటినీ మరలా ఒక వరుసలో పెట్టుకొని చూస్తేగాని అసలైన శాస్త్రార్థ Subject matter మేమిటో మన కవగతం కాదు.

ఇలాంటి ప్రతిబంధకాలున్నంత వరకూ హిరణ్యనిధి లాగా పదార్ధమక్కడే ఉన్నా అది మన అనుభవానికి రాదు. రాకనే చాలామంది జిజ్ఞాసువులు సరియైన మార్గమేదో తెలియక బాధ పడుతున్నారు. కొందరిదే మార్గమని చెప్పి దిక్కు తెలియక అపమార్గం పట్టిపోతున్నారు. మరికొందరికి మనకంతు పట్టే విషయం కాదు. ఒకవేళ కొంత తెలిసినా దానివలన సద్యః ఫలమేముందని ఉదాసీనత చూపుతున్నారు. ఇంకా కొందరు ప్రబుద్ధులయితే ఇది అనుభవానికి విరుద్ధం-కేవల ముబుసుపోకకు చేసే ప్రసంగమని కూడా సిద్ధాంతీకరిస్తున్నారు.

ఇన్ని అపోహలకూ కారణమొక్కటే. అది శాంకరమైన అద్వైత దర్శనం మనకందవలసిన రీతిలో అందకపోవటమే. శాస్త్ర సిద్ధాంత Theory మెంతగా ప్రతిపాదించారో భగవత్పాదులు. దాని అనుభవ మార్గం Practice కూడా అంతగానే నిరూపించారు. ఏ ఒక్కటీ కప్పిపుచ్చలేదు. అన్ని రహస్యాలూ ఆయిన రచనల్లోనే మనకు దర్శనమిస్తాయి. అయితే వాటి నొకటి కూడా తప్పి పోకుండా ఉన్నదున్నట్టు బయటపెట్టే నాథుడు లేడు. అటు ప్రాచీనులలో లేరు. ఇటు నవీనులలోనూ లేరు. ప్రాచీన పండితులున్నారంటే సాంప్రదాయికంగా చదువుకొన్నారే గాని అన్ని విషయాలనూ సమన్వయించే జ్ఞానం లేదు వారికి. ముక్కకు ముక్క విరిచి అర్థం చెప్పమంటే బ్రహ్మాండంగా చెబుతారు. అనవసరమైన తర్క వ్యాకరణ ప్రసంగాలతో కాలక్షేపం చేసి అవసరమైన చోట మౌనం వహిస్తారు. అది ఒక ఛాందసం. పోతే ఇక నవీనుల కిలాంటి ఛాందసం లేదు గాని వారిదొక ఆకాశ తాండవం. అసలు విషయానికి కట్టుబడక దాన్ని విడిచిపెట్టి అవీ ఇవీ ఏ కరువు పెడుతూ ఏదో విను వీధుల్లో ప్రయాణం చేస్తారు. శాస్త్రకారుడి ఉద్దేశమొకటైతే తామొకటి ఊహించి అందులో జొనపటానికి ప్రయత్నిస్తారు. కనుక ఇదీఒక హడావుడే. మొత్తం మీద రెండూ రెండు గానే అయి కూచున్నాయి. దీనితో పైన పేర్కొన్న అపోహలు లోకంలో తొలగిపోవటమలా ఉంచి అలాగే నిలిచిపోయే ప్రమాద మేర్పడింది.

ఇలాంటి ప్రమాదాన్ని నేను చాలాకాలం నుంచీ గమనిస్తూనే ఉన్నాను. దీని నెలాగైనా తొలగించి మొదట మన తెలుగువారికైనా ఉపకారం చేయాలని నాకు మనసులో ఒక ఉబలాట మేర్పడింది. అయితే వట్టి ఉబలాటం మాత్రమే అయితే ప్రయోజనం లేదు. దానికి దగిన అధికార సంపత్తి Equipment కూడా పోగు చేసుకోవాలి. అలాగైతే గాని అది కార్యరూపాన్ని ధరించబోదు.

అందుకోసమని ఆచార్యులవారి భాష్యార్ణవంలో నేను బహుకాలం నుంచీ మజ్జ నోన్మజ్జనం కావిస్తూ వచ్చాను. ఇంకా కాలహరణం చేశానంటే కాలమే నన్ను హరించవచ్చు ననే భయమొకటి ఇటీవలన ఏర్పడింది. అది మనకు మొదటికే మోసం. అంచేత తగినంత సామర్థ్యమబ్బిందని ఇంకా నమ్మకం లేకపోయినా పరమాత్మ మీద భారం వేసి ఇప్పటికీ తీరులో దీన్ని బయట పెడుతున్నాను. భగవత్పాద భాష్యార్థ మీమాంసా ఫలమిది. సరళమైన తెలుగు భాష అనే పళ్ళెరంలో పెట్టి దీనిని మీకు సమర్పిస్తున్నాను. ఇందులో నా ప్రజ్ఞ ఏమీ లేదు. అంతా జగద్గురు శ్రీ శంకర భగవత్పాదుల వారి కటాక్షమే. మహా అయితే వారు సూచనా మాత్ర సారంగా చెప్పిన కొన్ని భావాలను నేను ఆధునికుల బుద్ధుల కనుగుణంగా అక్కడక్కడ వివరించి ఉండవచ్చు. అదీ వారి కటాక్షమే. ఆ కటాక్ష బలమే నాకు వారి సిద్ధాంతంలో ఇమిడి ఉన్న అన్ని రహస్యాలనూ సాక్షాత్కరింప జేసింది.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

***