#


Index

చిత్రతరంగిణి

హిందూ మతమంటే ఏమిటి?

  చాలా రోజుల నాటి మాట. గుంటూరులో ఒక పెద్ద బహిరంగ సమావేశం జరుగుతూ ఉంటే దానికి నేను హాజరయ్యాను. సభలో ఒక మహాపురుషుడు హిందూమతాన్ని గూర్చి ఉపన్యసిస్తున్నాడు. ఆయన బహుశా అక్కిరాజు ఉమా కాంతం చెప్పిన ఉజ్జాయింపు సంస్కృత పండితుడయి ఉంటాడు. ఉపన్యాస మధ్యంలో ఆయనగారు హిందూ అంటే ఏమిటని ప్రశ్నించాడు. దానికాయనే సమాధానమిస్తూ, ఇలా సెలవిచ్చాడు. 'హీనమ్ దూషయతి ఇతి హిందూ:' హీనులను దూషించేదేదో అది హిందూ అనే మాటకర్థం. ఇలాంటి నిర్వచనాలు చెల్లేమాట అయితే సవాలక్ష చెప్పవచ్చు.

  హీనులను దూషించేదా హిందూమత మంటే, హిందూ మత ధర్మానికంతటికీ తలమానికం లాంటి గ్రంథమని గదా చెబుతారు భగవద్గీత. అలాంటి భగవద్గీత ఏమని చెబుతున్నది. 'విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైప శ్వ పాకేచ-పండితాస్సమ దర్శినః' విద్యా వినయాది సంస్కారం గలిగిన ఒక బ్రాహ్మణుణ్ణి ఎలా చూస్తామో అలాగే సంస్కారగంధమే మాత్రమూలేని ఒక మాలను కూడా చూడాలట. హీనులను దూషించవలసి వస్తే చండాలుణ్ణి దూరం చేయమని చెప్పవలసిందే గదా. అలా చెప్పటంలేదు సరిగదా. సద్రాహ్మణుడితో సమానంగా భావించమని చెబుతున్నది గీత. అంతేగాదు 'యేపిస్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రా స్తేపి యాంతి పరాంగతిమ్. స్త్రీలు వైశ్యులు, శూద్రులు అని మనం తక్కువగా చూచే వ్యక్తులను కూడ అలా తక్కువ చేయనక్కరలేదు. వారికి కూడ కర్మ జ్ఞానాధికారం ఏదో ఒక రూపంలో ఉండనే ఉన్నది. పురుషార్థ సాధనకు మానవుడై పుట్టిన ప్రతి ఒక్కడూ యోగ్యుడేనని ముక్తకంఠంతో చాటుతున్నది. ఇలా మత గ్రంథాలు సర్వమానవ సమానత్వాన్ని బోధిస్తుంటే హీనులను దూషించేది హిందూ అని చెబితే అది ఎంత హాస్యాస్పదం. హిందూ అనే మాటకే ప్యుత్పత్తి ఏమిటో తెలియని వాళ్ళు ఇంక హిందూ మతమంటే ఏమిటో ఎలా గ్రహించగలరు? దాని విశిష్టత నంతకన్నా ఎలా అర్థం చేసుకోగలరు?

Page 96

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు