సంగీత నాటక కళలు - సంస్కృతి
సంస్కృతి అనేమాట చాలా గంభీరమైన మాట. శబ్దమెంత చిన్నదిగా కనిపిస్తుందో దాని అర్థం అంత పెద్దది. సామాన్యంగా అర్థంలోని లోతునంత తడవకుండానే దొర్లిస్తుంటాము మనం శబ్దాలను. అలా దొర్లించే శబ్దాలలో ఇది కూడా ఒకటి 'కృతి' అంటే చేత అని అర్థం. ఈ కనిపించే ప్రపంచమంతా ఒకచేత, ఒకానొక మహాశక్తి మూలంగా ఏర్పడిన చేత. అందులోనూ చాలా బ్రహ్మాండమైన చేత కావటం మూలాన ఇది కేవలం కృతి మాత్రమే కాక ప్రకృతి అయింది. ప్రకృష్టమైన కృతి ఏదో అదే ప్రకృతి. ప్రకృష్ట మంటే ఎంతో పెద్దదనే అర్థం.
అయితే ఇది ఎంత బ్రహ్మాండమైన ప్రకృతి అయినా ఒక దృష్టితోచూస్తే దీనిలో ఎంతో వైషమ్యం గోచరిస్తుంది. ఇందులో మంచి ఉంది చెడ్డా ఉంది. సుఖమూ ఉంది. దుఃఖమూ ఉంది. సత్యమూ ఉంది. అసత్యమూ ఉంది. ఒక్కమాటలో చెబితే కావలసినదీ ఉంది. అక్కరలేనిదీ ఉంది. సర్వజ్ఞుడూ, సర్వశక్తి సంపన్నడూ పరమేశ్వరుడు. దీనినిలా గుణదోషాత్మకంగా సృష్టించి మనముందు పారవేయటంలో ఆయన ఆసించిన ప్రయోజనమేమిటి అనే ప్రశ్న వస్తుంది. గుణాన్ని మాత్రం తీసికొని దోషాన్ని వదలివేయాలని బహుశ ఆయన ఉద్దేశం. పెద్దలంతా ఈ రహస్యాన్ని తాము గుర్తించి లోకుందరికీ గుర్తు చేశారు కూడా. "జడచేతన గుణదోషమయ బిస్వకీన్హ కర తార - సంతహంస గుణగహయి పయ పరిహర బారి బికార" అని తులసీదాస మహాకవి చాటి చెప్పిన సూక్తిలో సారాంశ మిదేగదా.
ఇంతకూ గుణదోషాలను కలిపి సృష్టించటం దేవుడికృతి అయితే అందులోని దోషాలను సవరించి గుణసమ్మతంగా దిద్దుకోవడం జీవుడి కృతి. మొదటిది ప్రకృతి.. రెండవది సంస్కృతి, ప్రకృష్టంగా చేయడం మాత్రమే ప్రకృతి. కాని అది సమీచీనంగా లేకపోవచ్చు. సమీచీనంగా చేయటమే సంస్కృతి. సమీచీనమంటే చక్కగా బాగానని అర్థం. ఒకటి ఊరకచేయటంలోనూ చక్కగా చేయటంలోనూ ఎంతో తేడా ఉంటుంది. ఊరక యధేచ్ఛగా చేస్తే దానిలో అందంలేదు, చందంలేదు. తృప్తి అంతకన్నా లేదు. తృప్తి కోసమేగదా ఏ మానవుడైనా యత్నించేది. కాబట్టి వివేకవంతుడైన మానవుడి ప్రయత్న మెప్పుడూ బాగా చేయాలనే ఉంటుంది. అది మానవుడి మనస్తత్త్వంలోనే ఇమిడి ఉన్న ఒక ఆంతర్యం.
Page 87