ఎఱ్ఱాప్రెగడ జానపద చిత్రణము
నతద్ జ్ఞానమ్ నత చ్ఛిల్పమ్ నసా విద్యా నసాకళా జాయతే యన్న కావ్యాంగమ్ అహో భారో మహాన్ కవేః
అన్నారు ఆలంకారికులు. కవి అయిన వాడికి ప్రతి ఒక్క రంగములోనూ ప్రవేశముండాలట. రవి గాంచినచో కవి గాంచునే గదా అనే అభిజ్ఞుల మాట కూడా దీన్నే చాటుతున్నది. క్రాంతదర్శి అయిన కవిని గూర్చి ఎంత కీర్తించినా అందులో అతిశయోక్తి లేదు. క్రాంత దర్శన (Transcendental Vision) మనే గుణమే అందుకు కారణం. ఈ గుణంలో కూడా మళ్లీ అంతస్తులుంటాయి. అందులో బాగా పరిపాక Maturity మార్జించిన వాడికే మహాకవి అని పేరు. కవులెందరైనా ఉండవచ్చు. కాని మహాకవి అనేవాడు నూటికి కోటి కొక్కడుంటాడు. కనుకనే "అతివిచిత్ర కవిపరంపరా వాహిని సంసారే ద్విత్రా; పంచషావా మహా కవయ ఇతి గణ్యంతే" మహాకవులను వేళ్ళ మీద లెక్కపెట్ట వచ్చునని ఘోషించాడు ఆలంకారిక సార్వభౌముడైన ఆనంద వర్ధనాచార్యుడు. ప్రతి సాహిత్యంలోనూ ఉంటారలాంటి మహాకవులు. మన ఆంధ్ర సాహిత్యంలోనూ ఉన్నారు. నన్నయ తిక్కనాదులలాంటివారే. ఎఱ్ఱాప్రెగడ కూడా ఈ కోవకు చెందినవాడే.
సర్వతో ముఖమైన All comprehensive దృష్టియే గదా మహాకవి లక్షణమని మనవి చేశాను. అది నన్నయ, తిక్కనలలో వలెనే ఎఱ్ఱనలో కూడా చక్కగా కనిపిస్తుంది. శాస్త్రానుభవమెంత ఉందో లోకానుభవమంతగా ఉంది ఈ మహాకవికి. అలా ఉంటేనే అతడు మహాకవి అవుతాడు. అయితే అది ఎక్కడబడితే అక్కడ ప్రదర్శించకూడదు. సమయం వచ్చినప్పుడు ప్రదర్శించకపోరాదు. అనవసరంగా చూపితే అది చాపల్యం. అవసరంగా ప్రదర్శిస్తే అది ప్రౌఢి. ఇలాంటి ప్రౌఢకవి ఎఱ్ఱాప్రెగడ. వివిధ జీవితరంగాలలో తనకున్న లోకానుభవాన్ని ఆయా సందర్భాల కనుగుణంగా ప్రదర్శించి తన మహాకవి బిరుదాన్ని సార్ధకం చేసుకొన్నాడాయన. కనుకనే అసలాయనను ప్రబంధ పరమేశ్వరుడని పేర్కొన్నారేమోనని కూడా అనిపిస్తుంది.
Page 81