#


Index

చిత్రతరంగిణి

  ఇక్కడికి భక్తి ఏమిటో జ్ఞానమేమిటో రెంటికీ ఉన్న సంబంధ మేమిటో మనకు బోధపడింది. భక్తి అయినా -జ్ఞానమయినా - ఏదైనాసరే - స్వతంత్రంగా రెండూ మోక్షానికి మార్గాలనేమాట వట్టి మాట. జ్ఞానమనేది ఒక్కటే మోక్షానికి మార్గం. భక్తి కాశక్తి లేదు. ఎందుకంటే అది నామరూపాది గుణాల నాలంబనం చేసుకొన్నది. నామరూపాదుల వాసన ఉన్నంతవరకూ అది సంసారమే, సాయుజ్యం కాదు. పోతే జ్ఞానానికి దోహదం జేసి -ఆ జ్ఞానం క్రమంగా నిష్ఠగా మారి ఆ నిష్టారూపమైన భక్తి ఏదున్నదో అది మనకు మోక్షదాయకం. అయితే భక్తి అనిపేరేగాని అది సగుణం గాదు. నిర్గుణ రూపమైన జ్ఞానమే. మోక్షసాధన సామ గ్ర్యామ్ భక్తి రేవ గరీయసి అని అన్నారంటే ఈ దృష్టితో అన్నారు స్వామివారు. ఇది భక్తి జ్ఞాన సమన్వయం.

  ఈ సమన్వయ సూత్రాన్ని పట్టుకోలేక చాలామంది పండితులూ, పామరులూ సాధన మార్గంలో చిక్కుపడుతున్నారు. తాము నమ్మిందే మార్గమని అపోహ పడుతున్నారు. అధ్యాత్మవిద్య శాస్త్రీయంగా అభ్యసించక పోవటమే దీనికంతటికీ మూలం. కనుకనే 'తస్మాచ్ఛాస్త్రమ్ ప్రమాణం తే కార్యా కార్య వ్యవస్థితౌ' అన్నాడు. భగవానుడు. సత్యాసత్యాలు తెలుసుకోటానికి శాస్త్రమే కరదీపిక మనకు. ‘యశ్శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః సన సిద్ధి మవాప్నోతి' శాస్త్రోక్తమైన మార్గంలో కాక తన ఇచ్ఛానుసారంగా ప్రవర్తిస్తే ఏ మానవుడికీ సిద్ధిలేదు అని కూడా హెచ్చరించాడు. నిశ్చిత ఫలవద్ధి జ్ఞానం మనకు శాస్త్రం వల్లనే లభిస్తుందన్నారు భగవత్పాదులు. అంచేత శాస్త్ర ప్రామాణ్యాన్ని బట్టిచూచే వారికి సగుణ భక్తి జ్ఞానానికీ జ్ఞాన మనన్య భక్తి కీ- అది మోక్షానికీ చేర్చే సాధనాలనీ - మూడు మోక్ష మార్గంలో మూడు మజిలీలనీ - మూడు ఒకదాని కొకటి సహకరిస్తూ చివరకు ప్రసాదించే సమష్టిఫలం మోక్షమనీ - స్పష్టంగా బోధపడుతుంది.

Page 74

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు