మవతరించింది. అంచేత ఈ యథార్థజ్ఞానోదయానికి తోడ్పడిన ఆ భక్తి దీనికి కేవలం పూర్వరూపమేనని చెప్పవలసి ఉంది.
పోతే ఈ జ్ఞానమని పేర్కొంటున్నామే అది కూడా కేవల ముదయించినంత మాత్రాన మరలా సుఖం లేదు. ఉదయించిన తరువాత ఒక మెరుపులాగా మెరసి పోగూడదు. ఎప్పటికీ అలాగే నిలిచి ఉండాలది. దానిపాటి కది నిలవదు. మనం దాన్ని నిలుపుకోటానికి మరలా ప్రయత్నం చేస్తూపోవాలి. ఇది కేవల జ్ఞానం గాదు. జ్ఞాననిష్ఠ అంటారు దీన్ని. నిష్ఠ అనగానే ఇది ఆ కలిగిన జ్ఞానం కన్నాభిన్నమైన మరొక ప్రక్రియ అని మరలా భ్రాంతి పడరాదు. జ్ఞానమే ధారవాహికంగా ప్రవహిస్తూ పోతే అది జ్ఞాననిష్ఠ. కనుకనే జ్ఞానసంతాన కరణమని దీనికొక సార్థకమైన నామధేయం కల్పించారు భగవత్పాదులు. నిదిధ్యాసనమని కూడా దీనికే పేరు. విజాతీయ భావానంతరితమైన సజాతీయ భావప్రవాహ మేదున్నదో అది నిదిధ్యాసన. అద్వితీయాత్మ చైతన్యానికి విజాతీయం అనాత్మరూపమైన ఈ నామరూపాలే. చీకటి లాగా ఎప్పుడూ పొంచి ఉంటాయివి. జ్ఞానమనే వెలుగు తగ్గిందంటే మరలా వచ్చి నెత్తినపడతాయి. అపుడది మరలా సంసారమే. అంచేత ప్రపంచస్థాయికి దిగజారకుండా పోవాలంటే దానినలాగే ఏమరకుండా పట్టుకొని నిలుపుకొంటూ రావాలి.
అంటే లౌకిక వ్యాపారాలకు జలాంజలి ఇవ్వాలని గాదు మరలా. ఆవశ్యకమైన క్రియలు సాగిస్తూ ఉండవలసిందే. ఏ క్రియ సాగించినా అదంతా శుద్ధమైన ఆత్మ చైతన్యంలోకి ఎప్పటికప్పుడు ప్రవిలయం చేసుకొంటూ తన ఏకాత్మ భావాన్ని సడలకుండా చూసుకోవాలని భావం. ప్రహ్లాదాదులైన భాగవతుల జీవిత మిలాటిదే. పానీయాదులు సేవిస్తున్నా - సంభాషణాదులు సాగిస్తున్నా సంతత నారాయణచింత వదలలేదు వారు. చివర కా అనుసంధాన బలంతో ఈ విశ్వప్రపంచాన్నే విస్మరించేవారట. అంటే విశ్వాన్ని విశ్వమనే దృష్టితో గాక బ్రహ్మమనే భావనతో దర్శించేవారని త్పాతర్యం.
ఇదే నిధిధ్యాసన అన్నా, జ్ఞాన నిష్ఠ అన్నా. దీనినే భక్తి అని కూడా వ్యవహరించారు మన పెద్దలు. భక్తి అంటే ఇది ఇంతకుముందు వర్ణించిన భక్తిలాంటిది గాదు. అది జ్ఞానానికి పూర్వమైతే ఇది జ్ఞానాని కనంతరం కలిగేది. జ్ఞాన నిష్ఠా
Page 72